ఖమ్మం కమాన్‌బజార్/ కొత్తగూడెం గణేష్టెంపుల్, ఆగస్టు 20 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్ల ఎదుట నిరుద్యోగులతో కలిసి గురువారం మహా ధర్నా నిర్వహించారు.
పార్టీ జిల్లా కార్యదర్శులు నున్నా నాగేశ్వరరావు, మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యువతకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, రాష్ట్రంలోని రేవంత్ సరారు ఏటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, యూత్ డిక్లరేషన్ ప్రకటించినా ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. యూత్ డిక్లరేషన్ ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మొత్తం 60 వేలకు మించలేదన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనేక రాష్ర్టాలకు చెందిన యువత పోరాటాలు చూసైనా మన పాలకుల ఆలోచనలు మారాలని హితవుపలికారు.
ఇప్పటికైనా ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేసి, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పార్టీ ఆధ్వర్యంలో తమతో కలిసొచ్చే సంఘాలు, పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు, ప్రదర్శనలు చేపడుతామని హెచ్చరించారు. ఖమ్మంలో సీపీఎం నాయకులు వై.విక్రమ్, పొన్నం వెంకటేశ్వరరావు, మాచర్ల భారతి, బొంతు రాంబాబు, భూక్యా వీరభద్రం, మాదినేని రమేశ్, యర్రా శ్రీనివాస్‌రావు, బండి పద్మ, కొత్తగూడెంలో నాయకులు అన్నవరపు సత్యనారాయణ, కె.బ్రహ్మచారి, కారం పుల్లయ్య, లికి బాలరాజు, రేపాకుల శ్రీనివాస్, చిరంజీవినాయుడు, భూక్య రమేశ్, కోబల్, కాళంగి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.