ఖమ్మం, నవంబర్ 25: చింతకాని మండలం పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం రాష్ట్ర నాయకుడు సామినేని రామారావును హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు.
మూడు గంటలకుపైగా జరిగిన ఈ ధర్నాకు బీఆర్ఎస్, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు మద్దతు ప్రకటించాయి. హత్య జరిగి 26 రోజులైనా హంతకులను పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భట్టి, ఆయన సతీమణి నందిని, పోలీస్ కమిషనర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాయకులు, కార్యకర్తలు కలిసి బారికేడ్లను, పోలీసు వలయాన్ని ఛేదించుకుని కలెక్టరేట్ గేట్ల వరకు వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. సంయమనం పాటించాలని నేతలు కోరడంతో గేటు ఎదుటే బైఠాయించారు.
అధికార పార్టీకి పోలీసుల గులాంగిరీ: జాన్ వెస్లీ
అధికార పార్టీకి పోలీసులు గులాంగిరీ చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనని, హత్య అంటే భయపెట్టే రీతిలో ఖమ్మం సీపీ వ్యవహారం ఉందని ఆరోపించారు. సీపీఎం నేత పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ రామారావు హత్యకు భట్టి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నేత బాగం హేమంతరావు మాట్లాడుతూ ఈ హత్య కేసులో నిందితులను తేల్చడంలో పోలీసులు విఫలమైనట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేత, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ధ్వజమెత్తారు. న్యూడెమోక్రసీ నేత కోలా లక్ష్మీనారాయణ సహా సీపీఎం నాయకులు ఎర్రా శ్రీనివాసరావు, మాచర్ల భారతి, బండి రమేశ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్, బుగ్గవీటి సరళ, భూక్యా వీరభద్రం, మాదినేని రమేశ్, బొంతు రాంబాబు, బండి పద్మ, పొన్నం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.