బోనకల్లు, ఆగస్టు 23: ఎలాంటి షరతులూ లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి బోనకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు, నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రుణమాఫీ అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తలా ఒక ప్రకటన చేస్తున్నారని, పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతో రైతుల్లో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.2 లక్షల్లోపు రుణాలన్నింటినీ మాఫీ చేసినట్లు వైరా సభలో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంగా ప్రకటించారని గుర్తుచేశారు. కానీ సహకార సంఘాల్లో రూ.లక్షలోపు రుణాలున్న రైతుల్లో ఇంకా వందలాది మందికి మాఫీ జరగలేదని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ అనిశెట్టి పున్నంచందర్కు, ఏవో కొండూరి విజయభాస్కర్రెడ్డికి వినతిపత్రాలు సమర్పించారు. ఆ పార్టీ నాయకులు కందికొండ శ్రీనివాసరావు, చిట్టుమోదు నాగేశ్వరరావు, బంధం శ్రీనివాసరావు, కొమ్మినేని నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సునీత తదితరులు పాల్గొన్నారు.
కూసుమంచి (నేలకొండపల్లి), ఆగస్టు 23: రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నేలకొండపల్లిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆ పార్టీ నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, కేవీ రామిరెడ్డి, ఏటుకూరి రామారావు, రచ్చా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.