రఘునాథపాలెం, అక్టోబర్ 16: మున్నేరు ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా జరిగింది. మున్నేరు వరద ఉధృతి ముంపు ప్రాంత ప్రజలకు తీరని నష్టాన్ని మిగిల్చిందని అఖిలపక్ష పార్టీల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ, సీపీఎం నాయకులు నున్నా నాగేశ్వరరావు, ఎర్ర శ్రీకాంత్ మాట్లాడుతూ.. మున్నేరు వరద ప్రవాహంతో ముంపు ప్రజలు సర్వస్వాన్ని కోల్పోయారన్నారు.
ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు ఏమాత్రం ఆర్థికసాయం అందలేదన్నారు. కేవలం కంటితుడుపు చర్యగా కొంతమందికి మాత్రమే రూ.16,500 అకౌంట్లో జమ చేసి చేతులు దులుపుకున్నారని అన్నారు. అర్హులైన వందల మంది నిరుపేద బాధితులకు పరిహారం నేటికీ అకౌంట్లో నగదు జమ కాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్నేరు బాధితులను ఆదుకునేందుకు బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మున్నేరు ముంపునకు గురైన ప్రతి కుటుంబానికీ రూ.3 లక్షల నష్టపరిహారం అందించాలని కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి కేవలం కట్టుబట్టలే మిగిలాయని, ఒక్కో కుటుంబం 5 నుంచి రూ.10 లక్షల వరకు నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మం అర్బన్ తహసీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు మాటేటి నాగేశ్వరరావు, రుద్రగాని శ్రీదేవి, ఉపేందర్, మాటేటి కిరణ్‌కుమార్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.