ఖమ్మం, మార్చి 27: ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, సీఎం రేవంత్‌రెడ్డి ఆ హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, ఆవుల అశోక్ డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 16 వేల ఆసరా పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని, బోదకాలు బాధితులను దివ్యాంగులుగా గుర్తించాలని, పెన్షన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో పింఛన్ల కోసం అర్హులైన వారు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. తిరుమలాయపాలెం మండలంలో బోదకాలు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని, వారిని దివ్యాంగులుగా గుర్తించి పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీని గాలికొదిలేశారన్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అనంతరం మున్సిపల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాస్‌లైన్ డివిజన్ కార్యదర్శి ఝాన్సీ, నాయకులు సీహెచ్.శిరోమణి, శోభ, కే శ్రీనివాస్, బల్లెపల్లి వెంకటేశ్వర్లు, కే శ్రీనివాస్, సత్తార్, లెనిన్, వెంకటేష్, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, చందు, రామారావు, జాస్మిన్, రమేశ్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.