కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 12 : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే రూ.10వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా భారీ నష్టం వాటిల్లిందని, ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు, లోతట్టు ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని, ఈ విపత్కర పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం చేస్తున్నదని, నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసినప్పుడు రూ.5,644 కోట్లుగా తేలిందని, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటన లెక్కల ప్రకారం నష్టం రూ.6 వేల కోట్లుగా తేలిందన్నారు. అట్టి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మున్నేరు వరదతో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయని, ప్రజలు కట్టుబట్టలతో మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు, దెబ్బతిన్న ఇంటికి రూ.16,500 చొప్పున ఇస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేలు, ఇళ్లకు రూ.50 వేల చొప్పున ఇవ్వాలని, వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, సారయ్య, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాసరావు, మున్నా లక్ష్మీకుమారి, సలీం, రేసు ఎల్లయ్య, సలిగంటి శ్రీనివాస్, ఏపూరి బ్రహ్మం, దేవరకొండ శంకర్, వాసిరెడ్డి మురళి, వీసంశెట్టి పూర్ణచందర్రావు పాల్గొన్నారు.