ఖమ్మం, మార్చి 11 : సామరస్యమే సమాజానికి రక్ష అని, దీనికి ప్రతీకగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఉన్నదని సీపీ సునిల్ దత్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం ముస్లిం మత పెద్దలతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలు, మతాల వారు సోదరభావంతో మెలగడం మంచి సంప్రదాయమన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ శాంతియుత వాతావరణంలో పండుగను జరుపుకోవాలన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం పవిత్రమైనదని, నమాజ్ సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేరొన్నారు. ఏ సమస్య వచ్చినా మత పెద్దలు తన దృష్టికి తీసుకురావాలని కోరారు.
రంజాన్ మాసంలో ముస్లిం మత పెద్దలు, పోలీసులు కలిసి ఒక పీస్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రతి పండుగను సోదరభావంతో జరుపుకోవడం అనవాయితీగా వస్తోందన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ జి.ప్రసాదరావు, ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, ముస్లిం మత పెద్దలు మహ్మద్ అజీజ్, ఎస్డీ షబ్బీర్, ఎస్డీ మహబూబ్ అలీ, హఫీజ్ మన్నన్, ఎస్డీ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.