
ఖమ్మం, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఖమ్మం స్థానిక సంస్థల శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుపై 238 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నెల 10వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. మంగళవారం ఖమ్మంలోని బీపీఆర్సీ కేంద్రంలో కలెక్టర్ వీపీ.గౌతమ్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా 10 గంటలకు ఫలితం వెల్లడైంది. ఈ ఎన్నికలో మొత్తం 738 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుకు 480, కాంగ్రెస్ అభ్యర్థి రాయల్ నాగేశ్వరరావుకు 242, స్వతంత్య్ర అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌రావుకు 4, మరో స్వతంత్య్ర అభ్యర్థి సుధారాణికి ఒక్క ఓటూ రాలేదు. 12 ఓట్లు చెల్లుబాటు కాలేదని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
టీఆర్ఎస్లో నూతనోత్సాహం
ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో పార్టీశ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విజయం సాధించిన తాతా మధుసూదన్‌కు పలువురు నేతలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికాగానే బీపీఆర్సీ భవనానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియానాయక్, జిల్లా పరిషత్ చైర్మన్లు లింగాల కమల్‌రాజ్, కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చేరుకున్నారు. తాతా మధుసూదన్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పువ్వాడ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలో తాతా మధుసూదన్ ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ఎన్నికల కమిషన్ జారీచేసిన ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
ఓట్ల లెక్కింపును పర్యవేక్షించిన కలెక్టర్
ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతించారు. ఖమ్మం, కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్స్‌లను ఈ నెల 10వ తేదీ రాత్రి ఖమ్మం తరలించారు. పోలీసు భద్రత మధ్య బీపీఆర్సీ భవనంలో స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగానే అభ్యర్థుల సమక్షంలో అధికారులు బ్యాలెట్ బాక్సులను తెరిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్‌కు 238 ఓట్లు మెజార్టీ లభించగా.. కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుకు మొత్తం ఓట్లే 242 వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లతో దాదాపు సమానంగా టీఆర్ఎస్ అభ్యర్థి మెజార్టీ సాధించడం విశేషం. ఇక స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటలేకపోయారు. విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్‌కు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో సహా పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు. తాతా మధుసూదన్ సతీమణి భవాని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్దకు చేరుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు.
టీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఉన్నా.. పలు రాజకీయ పక్షాలు అనేక ఊహాగానాలను ప్రచారంలోకి తేవడంతో ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగుతుందని భావించారు. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూదన్‌కు పూర్తిస్థాయి మెజార్టీ లభించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఎన్నిక ఏదైనా విజయం టీఆర్ఎస్దేనని ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక మరోసారి నిజం చేసిందని రాష్ట్ర రవాణాశాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు.
భారీ బందోబస్తు
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.