ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఏడాదంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అన్నదాతలు.. అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. కాయకష్టం చేసి వారు పండించిన పంటను గ్రామాల్లో వారి వద్ద తక్కువ ధరకు కొంటున్న దళారులు.. చివరికి వారి పేరిటే సీసీఐలో మద్దతు ధరకు విక్రయిస్తూ లాభపడుతున్న దృశ్యాలు జిల్లాలో పుష్కలంగా కన్పిస్తున్నాయి. ఇందుకోసం సాక్షాత్తూ రైతులనే సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్తుండడం, వారితోనే అక్కడ సంతకాలు పెట్టిస్తుండడం, వారి పేరునే ఆన్లైన్లో చేయిస్తుండడం,
ఆఖరికి పట్టా పాస్‌బుక్కులు, బ్యాంకు ఖాతాలను కూడా వారివే వినియోగిస్తుండడం వంటివి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. దీంతో కర్షకుల కష్టాన్ని దళారులు దోచుకుంటున్నట్లు అవుతోంది. దళారులు తీసుకెళ్లి తమతో సంతకాలు పెట్టిస్తున్నా తమ పంటనే వారు విక్రయించుకుంటూ శ్రమలేని ప్రతిఫలాలు గడిస్తున్నారన్న విషయం తెలియని స్థితిలో రైతులు ఉండడం మరింత దయనీయం. రైతులు తీసుకొచ్చిన పత్తిని కొనేందుకు తేమ పేరుతో తంటాలు పెడుతున్న సీసీఐ అధికారులు.. దళారులు తెస్తున్న అదే రైతుల పంటను కొనుగోలు చేస్తుండడం వెనుక ఏమి మర్మం ఉందో వారే చెప్పాలి.
-ఖమ్మం రూరల్, నవంబర్ 30
పత్తి రైతులకు మంచి ధర అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భారత పత్తి సంస్థ (సీసీఐ)ను ఏర్పాటుచేసింది. ఇది జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి దాని ద్వారా రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తుంది. రైతులకు ప్రభుత్వ మద్దతు ధర అందిస్తుంది. అయితే ఈ కొనుగోళ్లలో పారదర్శకత కోసం అధికారులు అనేక పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినా దళారులు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో రైతులను చిత్తు చేస్తూనే ఉన్నారు. అయితే సీసీఐ సహా ఇతర మార్కెట్ కమిటీ సిబ్బంది దళారులకు దాసోహమవుతూ అన్నదాతలను అరిగోస పెడుతున్నారు.
అన్నదాతలకు ఆసరాగా ఉండి, దళారుల ఆట కట్టించాల్సిన సిబ్బందే.. దళారుల కొమ్ము కాయవడంతో విధిలేని పరిస్థితిలో రైతులు తలవంచుకోవాల్సి వస్తోంది. ఈ వానకాలంలో పత్తి రైతులు సాగు చేసిన పంటకు మద్దతు ధర ఇచ్చి వారికి ఆర్థిక పరిపుష్టి అందించేందుకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీసీఐ అధికారులు ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. అందులో భాగంగానే ఖమ్మం రూరల్ మండలంలో గుర్రాలపాడు, మద్దులపల్లి, పొన్నెకల్లు గ్రామాల పరిధిలోని జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతుల పంట కొనుగోళ్లు చేపడుతున్నారు.
అయితే సీజన్ ఆరంభంలో తేమ శాతం ఎక్కువగా నమోదు కాకపోవడంతో ఆశించిన మేర క్రయవిక్రయాలు సాగలేదు. గడిచిన వారం రోజుల నుంచి పంట పూర్తిగా ఆరడంతో సీసీఐ కేంద్రాలకు వచ్చిన దాదాపు అన్ని వాహనాల్లోని పత్తి తేమ శాతం ఒకే విధంగా నమోదవుతోంది. సరిగ్గా ఇదే అదునుగా భావించిన దళారులు.. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తమ దందాకు పదునుపెట్టారు. కొణిజర్ల, రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ తదిరత మండలాల్లో కౌంటర్లు పెట్టి రైతుల వద్ద క్వింటాకు రూ.6,000 నుంచి రూ.6,400 చొప్పున వెచ్చించి పత్తిని కొనుగోలు చేస్తున్నారు. అక్కడ కొనుగోలు చేసిన పంటను సీసీఐకి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికీ, ఎక్కడా అనుమానం రాకుండా తమ వ్యూహాలకు పదను పెడుతున్నారు.
‘వడ్డించే వాడు మనవాడైతే..’ అనే సామెతలా ఉంది సీసీఐ కేంద్రాల్లో దళారుల తీరు. అతివృష్టి, చీడపీడల కారణంగా ఇప్పటికే దిగుబడులు గణనీయంగా తగ్గి అన్నదాతలు గోస పడుతున్నారు. ఇలాంటి తరుణంలో అన్నింటినీ తట్టుకొని చేతికొచ్చిన పంటను రైతులు సీసీఐ కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ వారిని దళారులు దగా చేస్తున్నారు. గ్రామాల్లో రైతుల వద్ద పంటను కొనుగోలు చేస్తున్న దళారుల్లోని కొందరు అడ్తీవ్యాపారులు కూడా ఈ దందా చేస్తున్నారు.
రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, కొణిజర్ల మండలాలకు చెందిన కమీషన్ వ్యాపారులు ఊళ్లలో తాము అప్పులిచ్చిన రైతుల వద్ద పంటను కొనుగోలు చేస్తున్నారు. ఆ పంటను అక్కడి నుంచి నేరుగా సీసీఐ కేంద్రాలకు తరలిస్తున్నారు. పై పెచ్చు.. పంటను కొనుగోలు చేసిన తరువాత అదే రైతులను సీసీఐ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి సీసీఐ నిబంధనల ప్రకారం వారితో సంతకాలు చేయిస్తున్నారు. రైతులు రాని పక్షంలో వచ్చిన రైతులతోనే అనేక ఫొటోలు తీయించి సీసీఐ సైట్లో అప్లోడ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీఐ సెంటర్ల వద్ద ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే సిబ్బంది రైతులతో రకరకాలుగా వేశాలు వేయించి పంటను పాస్ చేయించడం విశేషం.
‘సంతకం పెట్టి వెంటనే వద్దవుగాని రా..’ అంటే ఇక్కడికి వచ్చాను. నాలుగు రోజుల క్రితం నేను పండించిన పంటను మా ఊరి అతడికి అమ్మాను. క్వింటాకు రూ.6,400 చొప్పున బేరం కుదిరింది. నాతోపాటు మా గ్రామంలో చాలామంది పత్తి పంటను అతడికి అమ్మారు. అయితే, ‘ఈ రోజు మీరు వచ్చి సంతకం పెట్టాలి’ అంటే వచ్చాను. ఉదయం నుంచి నన్ను ఈ సీసీఐ కేంద్రం వద్దనే ఉంచారు. ఇప్పటికి మూడుసార్లు నన్ను ఫొటో దింపారు. ఒకసారి తువ్వాలతో దింపారు. మరోసారి తువ్వాల లేకుండా దింపారు. ఎందుకు తీసుకొచ్చారో తెలవడం లేదు. నాతోపాటు చాలామంది సంతకాలు పెట్టేందుకు ఈ జిన్నింగ్ మిల్లు వద్దకు వచ్చారు.
– వెంకటేశ్వర్లు, బాధిత రైతు, పెద్దగోపతి