దూదిపూల రైతులకు అడుగడుగునా దుఃఖమే మిగులుతోంది. మద్దతు ధరకే విక్రయించుకోవాలంటూ ప్రకటనలు గుప్పిస్తున్న పాలకులు.. పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు సహకరిస్తుండడంతో కర్షకులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇక కోట్లాది కొర్రీలతో సీసీఐ అధికారులు మద్దతు ధరకు మంగళం పాడడంతో రైతుల రెక్కల కష్టం ఖరీదుదారుల పరమవుతోంది. అసలైన రైతులు ట్రాక్టర్లలో తెచ్చిన పత్తిని కొనేందుకు సవాలక్ష సాకులు చూపుతున్న సీసీఐ అధికారులు.. ప్రైవేటు వ్యాపారులు బొలేరో వాహనాల్లో తెచ్చిన పత్తిని కొనేందుకు మాత్రం ఎర్రతివాచీ పరుస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో సోమవారం రెండు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు కాటన్ రైతుల కంట పడడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీసీఐ అధికారులను ఘెరావ్ చేయగా.. తిరుమలాయపాలెంలో కాటన్ మిల్లు గేటుకు తాళం వేశారు. దీంతో పత్తి కొనుగోళ్లలో ప్రభుత్వ ఉదాసీన వ్యవహారం, వ్యాపారుల దోపిడీ మర్మం వంటివి మరోసారి వెలుగు చూశాయి.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ తిరుమలాయపాలెం, నవంబర్ 18
పంట సీజన్‌కు రెండు నెలల ముందు నుంచే జిల్లాలో భారత పత్తి సంస్థ(సీసీఐ) కేంద్రాల ఏర్పాటుకు అధికారులు అనేక కసరత్తులు చేసినప్పటికీ ఆశించిన ఫలితం కన్పించడం లేదు. ‘సీసీఐ కేంద్రాలు ఉన్నాయా?’ అంటే ‘ఉన్నాయి’ అనే రీతిలో మాత్రమే అవి దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్ పత్తి పంటను కొనుగోలు చేయించేందుకు జిల్లా అధికారులు ఆయా మండలాల్లో తొమ్మిది సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ ప్రధానమైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మాత్రం ఏర్పాటు చేయలేదు. కేవలం జిన్నింగ్ మిల్లులు ఉన్న చోట ఆయా మిల్లుల ఆవరణలో మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయనప్పటికీ ఇక్కడి పత్తి యార్డులో ప్రైవేటు వ్యాపారులు రైతుల పత్తిని కొనుగోలు చేస్తారు.
అయినా ఇక్కడికి రోజుకు 30 వేల నుంచి 40 వేల వరకూ పత్తి బస్తాలను జిల్లా రైతులు, పొరుగు జిల్లాల రైతులు తీసుకొస్తున్నారు. ఇక్కడ సీసీఐ కేంద్రం లేకపోవడంతో వీరి పత్తిని వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. కొందరు రైతులు శ్రమకోర్చి జిన్నింగ్ మిల్లుల్లోని సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లినా.. 8 నుంచి 12 శాతం మధ్య తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామంటూ సీసీఐ అధికారులు కొర్రీలు పెడుతున్నారు. దీంతో చాలామంది రైతులు ఎంతోకొంత ధరకు అక్కడే జిన్నింగ్ మిల్లు యజమానికి అమ్ముకొని ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు.
మరికొందరు రైతులు కాస్త ధైర్యం చేసి, రవాణా చార్జీలు భరించి మరుసటి రోజు ఖమ్మం ఏఎంసీలోని ప్రైవేటు వ్యాపారుల వద్దకు పంటను తెస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా ఆ వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. సీసీఐ మద్దతు ధర రూ.7,521 ఉన్నప్పటికీ అందులో దాదాపు సగానికి తగ్గించి కొంటున్నారు. రైతులు నాణ్యమైన పత్తిని తెస్తున్నప్పటికీ తేమ శాతాన్ని బూచిగా చూపి ధరను అమాంతం తగ్గిస్తున్నారు. దీంతో రైతులు ఆగ్రహావేశాలకు గురవుతున్నప్పటికీ ప్రత్యామ్నాయం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేట్ వ్యాపారులకు వారు చెప్పిన ధరకే అమ్ముకుంటున్నారు. గత వారం ఖమ్మం కలెక్టర్ ఇక్కడి ఏఎంసీని తనిఖీ చేసిన సమయంలో రైతుల పంటలో తేమ శాతాన్ని స్వయంగా పరీక్షించారు. 9 శాతం తేమ కలిగిన పంటకు వ్యాపారులు రూ.4,300 ధర పెట్టడంతో కలెక్టర్ ఆగ్రహించారు. అయినా ఖరీదుదారుల వైఖరిలో మార్పు రాలేదు. పైగా ధరలు మరింత తగ్గించి కొంటున్నారు.
గతంలో మాదిరిగా ఖమ్మం ఏఎంసీలో సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని, మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ఇదే డిమాండ్‌పై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పార్టీ నాయకులు ఇటీవల ఏఎంసీని సందర్శించారు. సీపీఎం, సీపీఐ, ఎన్డీ పార్టీల నేతలు కూడా ఇక్కడ ఆందోళనలు చేపట్టారు. ఈ పార్టీలు చేసిన డిమాండ్లు, ఇచ్చిన వినతులు బుట్టదాఖలయ్యాయి.