ఖమ్మం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో పత్తి రైతులు కుదేలవుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగా దూదిపూల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఖమ్మం ఏఎంసీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ తదితరులు కలిసి ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తియార్డులో క్రయవిక్రయాలను మంగళవారం పరిశీలించారు. గడిచిన వారం రోజుల నుంచి వానకాలం సీజన్లో సాగు చేసిన పంటను రైతులు ఖమ్మం మార్కెట్‌కు భారీగా తీసుకొస్తున్నారు.
ఈ సంవత్సరం భారత పత్తి సంస్థ (సీసీఐ) జిల్లా వ్యాప్తంగా తొమ్మిది జిన్నింగ్ మిల్లులను సీసీఐ కేంద్రాలుగా గుర్తించినప్పటికీ వాటిల్లో కేవలం నాలుగు కేంద్రాల్లో మాత్రమే నామమాత్రంగా పంటను కొనుగోలు చేస్తోంది. దీనికితోడు దిగుబడులు పూర్తిగా పడిపోవడం, మార్కెట్లో మద్దతు ధర లేకపోవడం వంటి కారణాలతో కర్షకులు ఆగమాగమవుతున్నారు. అలాంటి రైతులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఉదయం 9 గంటలకే ఏఎంసీకి వచ్చారు. అక్కడి పత్తి రైతులు వారికి ఘన స్వాగతం పలికారు. తమ పంటను వారికి చూపించి తమ బాధలు చెప్పుకునేందుకు బారులు తీరారు. కొందరు రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ కంటతడి పెట్టారు.
ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు తండాకు చెందిన మాళోత్ కాళీదాసు అనే రైతు తన బాధ చెప్పుకున్నాడు. తాను దాదాపుగా 40 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేశానని, తీరా పంటను మార్కెట్‌కు తెస్తే క్వింటాకు రూ.6,500 మించి ఖరీదుదారులు ధర పెట్టడం లేదని వాపోయాడు. రఘునాథపాలెం మండలం మంగ్యాతండాకు చెందిన యువరైతు బానోత్ రవి కూడా తన గోడు వెళ్లబోసుకున్నాడు. తాను 14బస్తాల పంటను తెస్తే కనీసం పంటను చూసేందుకు ఒక్క వ్యాపారి కూడా రావడం లేదని కన్నీరుపెట్టుకున్నాడు. ఇలా దాదాపు రెండుగంటలపాటు నాయకులు ప్రతి రైతు వద్దకూ వెళ్లి పేరుపేరునా వారిని పలుకరించి వారి సమస్యలను సావధానంగా విన్నారు. రైతులకు ఎల్లవేళలా బీఆర్ఎస్ అండగా ఉంటుందని, మద్దతు ధర వచ్చే వరకు పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.
సీసీఐ, ఏఎంసీ అధికారుల తీరుపై ఆగ్రహం
రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంలో సీసీఐ, ఏఎంసీ అధికారులు పాత్ర కూడా ఉందని, తద్వారా రైతులు మద్దతు ధర పొందలేకపోతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఎదుటనే అధికారుల తీరును తప్పుబట్టారు. పంటను తెచ్చిన రైతులకు మద్దతు ధర అందుతుందా? లేదా? అని ఏ ఒక్క అధికారీ ఆరా తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్‌కు బీఆర్ఎస్ నేతల వినతి
ఖమ్మం, నవంబర్ 5: జిల్లాలో పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు తాతా మధు, సండ్ర వెంకటవీరయ్య, లింగాల కమల్‌రాజు, ఆర్జేసీ కృష్ణ తదితరులు మాట్లాడుతూ.. ఖమ్మం వ్యవసాయ మారెట్లో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. వారు తమ పంటను సరైన ధరకు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం వ్యవసాయ మారెట్లో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, అకాల వర్షాలు, ఇతర వైపరీత్యాల వల్ల నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సౌకర్యార్థం గతంలో మాదిరిగా ఏఎంసీలో సబ్సిడీ క్యాంటీన్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏఎంసీలోనే సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలి
విలేకరుల సమావేశంలో తాతా మధు, సండ్ర
గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది జిల్లాలో పత్తి రైతులు నష్టపోయారని తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధరల విషయంలో జిల్లాలోని ముగ్గురు మంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. సీసీఐ కొర్రీలతో రైతుల పంట మొత్తం ప్రైవేటుకు వెళ్తోందని ఆరోపించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. పత్తి రైతులకు క్వింటాకు రూ.వెయ్యి చొప్పున బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటను తీసుకొచ్చిన ప్రతి రైతూ కన్నీళ్లు పెడుతుంటే ఎంతో బాధ కలుగుతోందని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పెద్ద రైతు అయి ఉండి కూడా రైతుల బాధలను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ.. కేవలం దళారుల పంట కొనుగోలు చేసేందుకు మాత్రమే సీసీఐ కేంద్రాలను దూరంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఒకవైపు పత్తి రైతుల బాధలు ఇలా ఉంటే ఒక్క రోజులోనే వేలాది రూపాయల ధర తగ్గించి మిర్చి వ్యాపారులు సైతం ఆ రైతుల రెక్కల కష్టాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు, రైతు సంఘం నాయకులు బెల్లం వేణు, వీరూనాయక్, ఉన్నం బ్రహ్మయ్య, హరిప్రసాద్, పసుమర్తి రామ్మోహన్, తోట వీరభద్రం, పగడాల నరేందర్, ఎర్రా అప్పారావు, మాటేటి నాగేశ్వరరావు, మాటేటి కిరణ్, బండి సతీశ్, ఉప్పుగుండ్ల వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.