– కూసుమంచి డివిజన్ ఏడిఏ ఎం.సతీష్
ఖమ్మం రూరల్, జూన్ 30 : పత్తి రైతులు అధిక సాంద్రత విధానంలో సాగు చేపట్టి అధిక దిగుబడులు పొందాలని కూసుమంచి డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం.సతీష్ అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లు రైతు వేదికలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార పథకంలో భాగంగా పలువురి రైతులకు రాయితీపై పత్తి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏడీఎస్ సతీష్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే రైతులు ఆశించిన దిగుబడులు పొందవచ్చునని తెలిపారు. మొక్కల సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల సాధారణం కంటే రెండు నుండి మూడు క్వింటాల దిగుబడి పొందే అవకాశం ఉంటుందన్నారు.
శాస్త్రీయ పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల సమగ్ర యాజమాన్య పద్ధతులు సకాలంలో చేపడితే మంచి ఫలితాలు పొందవచ్చు అన్నారు. తక్కువ ఎత్తు కొమ్మలు మాత్రమే ఉండే ప్రత్యేక హైబ్రిడ్ విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, తద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోటి శ్రీనివాసరావు, ఖమ్మం ఎఫ్ టి సి ఏ డి ఏ బి వాణి, మండల ఏఓ ఉమ నగేష్, ఎఫ్ టి సి ఏ ఓ శరత్ బాబు, పాలేరు నియోజకవర్గ ఉద్యాన అధికారి అపర్ణ, ఎంపీడీవో రవికుమార్, ఆయా క్లస్టర్ ఏఈవోలు, పంచాయతీ సెక్రెటరీ తిలక్ పాల్గొన్నారు.