రఘునాథపాలెం, డిసెంబర్ 21: ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఇన్చార్జి అధికారి అవినీతి బట్టబయలైంది. ఈ విషయం ఏసీబీ దాడులతో తేటతెల్లమవుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం ఆర్టీవో ఆఫీస్‌పై ఆకస్మిక దాడులు చేపట్టిన ఏసీబీ అధికారులు 21 గంటల పాటు ఏకధాటిగా తనిఖీలు చేపట్టి అనేక విషయాలను రాబట్టారు. ఆర్టీవో ఆఫీస్‌తోపాటు ఇన్చార్జి డీటీవో, ఏఎంవీఐ ఇళ్లల్లోనూ దాడులు చేపట్టారు. అయితే ఆర్టీవో ఆఫీస్‌పై దాడికి ముందుగా ఏజెంట్ల కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఆర్టీవో ఆఫీస్‌కు సంబంధించిన వందల సంఖ్యలో వాహనదారులకు చెందిన డ్రైవింగ్ లైసెన్స్కార్డులు, ఆర్సీ కార్డులు, ఆఫీస్ రికార్డులు ఉండటాన్ని గుర్తించారు.
కార్యాలయానికి వచ్చే ఫైళ్లు నేరుగా వాహనదారుల నుంచి కాకుండా ఏజెంట్ల ద్వారా వస్తున్నాయని తెలుసుకున్నారు. ఏజెంట్ల ద్వారా వచ్చే ప్రతి ఫైలుపై ఇన్చార్జి అధికారి నియమించుకున్న ప్రైవేటు వ్యక్తి వేసిన ‘కోడ్’లు ఉండటం గుర్తించారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్సీ రమేశ్ విచారణలో భాగంగా ఇన్చార్జి డీటీవో నియమించుకున్న ప్రైవేటు వ్యక్తిని నిలదీయగా ‘సార్’ ఆదేశాల మేరకే పనిచేస్తూ ‘కోడ్’లను వేస్తూ వస్తున్నానని, ఆ తరువాయి ఫైళ్లపై ఏజెంట్ల వద్ద నుంచి వచ్చే రొక్కాన్ని వసూలు చేస్తున్నట్లు రిపోర్టుగా రాసి ఇచ్చినట్లు తెలిసింది. ఈక్రమంలో ప్రతిరోజూ సుమారుగా రూ.1.50 లక్షలు ఏజెంట్ల వద్ద నుంచి వసూలు చేసి అధికారికి ముట్టజెప్తున్నట్లుగా ఒప్పుకున్నట్లు తెలిసింది.
ఇదే విషయంపై ఆఫీస్ అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరిగా అంతా అధికారి ఆదేశాలతోనే పనులు చక్కదిద్దుతూ వస్తున్నామని రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఏజెంట్ల అందరితోనూ వేర్వేరుగా పేరు, అడ్రస్‌తోపాటు కార్యాలయం పేరుతో తాము చేసే పనులు, ఆయా పనులకు ఇచ్చే డబ్బులు ఎంతెంత..? అనే దానిపై రాసి ఇచ్చినట్లు తెలిసింది. వీటన్నింటి నడుమ ఇక ఇన్చార్జ్ అధికారిపై వేటు తప్పనిసరి అనే మాటలు కార్యాలయం సిబ్బంది, ఏజెంట్ల నుంచి వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఏసీబీ డీఏస్పీని వివరణ కోరగా తనిఖీలు పూర్తయ్యాయని నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు.