దమ్మపేట రూరల్, డిసెంబర్ 5 : మొక్కజొన్న విత్తనోత్పత్తి కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ కరువైంది. వ్యవసాయ శాఖ అధికారులు కంపెనీల కార్యకలాపాలను పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రైతు వ్యవసాయ క్షేత్రాలను ప్రయోగశాలలుగా మార్చి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో రెండు వేల దశకంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి సాగు ప్రారంభమైంది. నాటినుంచి మండల ప్రధాన పంట మొక్కజొన్న విత్తనోత్పత్తి మాత్రమే. ఈ పంట అర్లీ రబీ, రబీ పంటగా సుమారు 15 వేల ఎకరాల్లో సాగవుతోంది. ఈ పంటను బహుళజాతి కంపెనీలతోపాటు కొన్ని దేశీయ కంపెనీలు స్థానిక ఆర్గనైజర్ల ద్వారా సాగు చేయిస్తున్నాయి.
ఆడ, మగ విత్తనాలను వేరువేరుగా నాటించి సాగు చేయిస్తున్నారు. కొన్ని కంపెనీలు పరాగ సంపర్కం(పాలినేషన్) పూర్తయిన తరువాత మగ మొక్కజొన్న కర్రలను ధ్వసం చేయిస్తాయి. కొన్ని కంపెనీలు మగ మొక్కజొన్న కంకులు తయారైన తరువాత వేరుగా పంటను కోసి బహిరంగ మార్కెట్లో రైతులు ప్రత్యేకంగా అమ్ముకుని ఆదాయం పొందే వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ విధంగా పండించిన ఆడ మొక్కజొన్న కంకులను ఆయా కంపెనీల ఆర్గనైజర్ల ద్వారా వెనక్కి(బై బ్యాక్) కొనుగోలు చేసి రైతులకు 15 రోజుల నుంచి 3 నెలలలోపు చెల్లింపులు చేస్తున్నాయి.
కంపెనీలు రైతులకు ఇచ్చే ఫౌండేషన్ సీడ్ రకం బహిర్గతం కాకుండా పూర్తి గోప్యత పాటిస్తాయి. రైతులకు ఇచ్చే సీడ్ ప్యాకెట్లపై కంపెనీ పేరు ఉండదు. కేవలం బ్యాచ్ నంబరు, లాట్ నంబరు, పరిమాణం, నాటాల్సిన విస్తీర్ణం వివరాలు మాత్రమే ముద్రిస్తారు. ఫౌండేషన్ సీడ్ తయారీలు జరిగే ప్రయోగాల దుష్పరిణామాల వల్ల మొలక తక్కువగా ఉండడం, పాలినేషన్ సమస్యలతో కంకికి గింజలు పట్టకపోవడం, జన్యులోపాలు, కంకి పరిమాణం చిన్నదిగా ఉండడం వంటి సమస్యలు కోకొల్లలు. పొరుగు రైతులందరూ ఒకే రకమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా దిగుబడుల్లో మాత్రం వ్యత్యాసం వస్తుందని ప్రతి ఏటా రైతులు గగ్గోలు పెట్టడం ఈ ప్రాంతంలో సహజం. దీనికి కారణాలను పరిశోధిస్తే కంపెనీలు వేరువేరు బ్యాచ్‌ల ఫౌండేషన్ సీడ్ రైతులకు ఇచ్చి సాగు చేయిస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో బ్యాచ్ ఫౌండేషన్ సీడ్ దిగుబడి ఒక్కో రకంగా ఉంటుంది.
బహుళజాతి కంపెనీలు, దేశీయంగా కొన్ని కంపెనీలకు ఆర్అండ్డీ(రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) లేకుండానే రైతులతో మొక్కజొన్న విత్తనోత్పత్తిని చేయిస్తున్నాయి. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటే ఫర్వాలేదు కానీ పంట సక్రమంగా పండకపోతే ఈ కంపెనీలు ఆచూకీ లేకుండా పోతున్నాయి. ఫలితంగా ఈ పంట సాగు చేసే రైతులు నష్టపోతున్నారు.
విత్తనాలను నాటించే ముందు రైతుల నుంచి ఆయా కంపెనీలు నిబంధనలతో బాండ్లు తీసుకుంటాయి. రైతులకు మాత్రం కంపెనీల నుంచి ఎటువంటి బాండ్లు, ఒప్పందాలు ఉండవు.
మొక్కజొన్న విత్తనోత్పత్తి ఆర్గనైజర్ వ్యాపారం లాభాసాటిగా ఉందని రైతుల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తవచ్చని చెబుతున్నారు. విత్తనాల ప్రాసెసింగ్‌లో భాగమైన డ్రైయర్ యూనిట్లు సైతం కొంతమంది ఆర్గనైజర్లు సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. రైతులు పండించిన కొన్ని పేరుగాంచిన కంపెనీల విత్తనాలను ఆ కంపెనీలకు ఇవ్వకుండా ఎక్కువ ధరకు ఇతర వ్యాపారులకు కొంతమంది ఆర్గనైజర్లు అమ్ముకుని అధిక లాభాలు అర్జిస్తున్నారు. మొత్తానికి ఆరుగాలం కష్టించిన రైతుల ఆదాయం గోరంత.. ఆర్గనైజర్లు, కంపెనీల ఆదాయం కొండంత అన్నట్లుగా ఉంది.
రైతులు పండించిన పంటకు చెల్లించే సొమ్ము ఆయా కంపెనీలు నియమించుకున్న ఆర్గనైజర్ల ఖాతాల్లోనే జమ చేస్తాయి. టన్ను మొక్కజొన్న కంకులకు కంపెనీ చెల్లించే ధర రైతులకు తెలియకుండా గోప్యత పాటిస్తారు. ఆర్గనైజర్ రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం మాత్రమే రైతులకు చెల్లిస్తాడు. దీనిని బట్టి కంపెనీ చెల్లించే ధరకు, ఆర్గనైజర్ చెల్లించే ధరకు వ్యత్యాసం ఉన్నట్లు తేటతెల్లమవుతున్నది. ప్రయాగాత్మక రకం సీడ్ ఇచ్చినప్పుడు పంట దిగుబడులు రాకపోతే రైతులు ఆందోళనలు చేయకుండా ఎంతో కొంత ఇవ్వడం ఆర్గనైజర్లకు పరిపాటిగా మారింది.
విత్తనోత్పత్తిపై వ్యవసాయ శాఖ అధికారులకు ఎటుంటి నియంత్రణ, పర్యవేక్షణ అధికారాలు లేవు. వీరు కేవలం పంట నమోదు కార్యక్రమానికే పరిమితం. రైతులను కంపెనీలు మోసగిస్తే సాధారణ ఛీటింగ్ కేసు మినహా ఎటువంటి చర్యలు ఉండవు. ఎందుకంటే రైతుల నుంచి తీసుకుంటున్న బాండ్లల్లో కంపెనీలు తమకు అనుకూలంగా అన్నింటికీ రైతులను బద్దులు చేస్తున్నాయి. ఈ విషయమై ఏవో చంద్రశేఖర్‌రెడ్డిని వివరణ కోరగా విత్తనోత్పత్తి చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు తమకు ఎటువంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు.