మధిర, మార్చి 15 : జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం మధిరలోని సిపిఎం కార్యాలయంలో రైట్ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న పంట రైతుల చేతికి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పంట కొనుగోళ్లకు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. దళారుల చేతుల్లో రైతాంగం పడకుండా గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. లేకపోతే దళారులు రైతులను మోసం చేసి తక్కువ ధర కొంటారన్నారు.
ఈ వేసవిలో సాగులో ఉన్న మొక్కజొన్న పంటకు చివరి తడులకు నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, చివరి భూముల వరకు సాగునీరు అందడం లేదన్నారు. మొక్కజొన్న పండించే రైతులకు అధిక మొత్తంలో పెట్టుబడి పెరిగిందని పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు మందా సైదులు, పాపినేని రామ నరసయ్య, తేలప్రోలు రాధాకృష్ణ పాల్గొన్నారు.