మామిళ్లగూడెం, ఫిబ్రవరి 27: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. రూట్, సెక్టార్ అధికారుల నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై ఐడీవోసీలో నోడల్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎకడా ఎలాంటి పొరపాట్లకూ తావు ఇవ్వకూడదని సూచించారు. అన్ని విభాగాల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. పోలీసులకు కూడా ఎన్నికల విధులపై శిక్షణ ఇవ్వాలన్నారు. కేంద్రీకృత రిసిప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలు ఉండాలన్నారు. ఈవీఎంలు, ఎన్నికల సిబ్బంది రవాణాకు పటిష్ఠ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వాహనాలకు జీపీఎస్ సిస్టం అమర్చి వాటిని ట్రాక్ చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఓటర్ టర్నోవర్ తకువగా ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలో సర్వే చేపట్టి పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, ఎన్నికల ఖర్చు నియంత్రణపై పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లా కంట్రోల్ రూమ్‌ను 24×7 నిర్వహించాలన్నారు. ఫిర్యాదులు, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్‌సింగ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల సంఘం జిల్లాకు కేటాయించిన అదనపు ఈవీఎంల ఫస్ట్ లెవల్ తనిఖీని పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం, వీవీ ప్యాట్ల గోడౌన్లో మంగళవారం చేపట్టిన ఫస్ట్ లెవల్ తనిఖీని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి 14 వరకు 1,920 కంట్రోల్ యూనిట్లు, 3,994 బ్యాలెట్ యూనిట్లు, 2,263 వీవీ ప్యాట్లను, ఈ నెల 26, 27 తేదీల్లో అదనంగా కేటాయించిన 60 కంట్రోల్ యూనిట్లను ఫస్ట్ లెవల్ తనిఖీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు వివరించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు, సిబ్బంది హుస్సేన్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.