అశ్వాపురం, మార్చి 25: పాత బిల్లులు చెల్లించడంలేదంటూ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎదుట ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి పురుగులమందు డబ్బా తీసుకొని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చిన అతడు.. ఎంపీడీవో గది బయట గుమ్మం వద్ద సాష్టాంగంగా పడుకున్నాడు. పాత బిల్లులు చెల్లించకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో బుధవారం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన జాలే శ్రీనివాస్‌రెడ్డి అనే కాంట్రాక్టర్.. మండలంలోని మూడు పంచాయతీల్లో గడిచిన మూడేళ్లుగా పైపులైన్లు, వాటర్ ట్యాంకుల మెట్లు, మోటర్ల మరమ్మతులు, పెయింటింగ్ సహా ఇతర సివిల్ పనులు చేశాడు.
అందుకుగాను అతడికి రూ.8 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేసింది. ఆ నిధుల్లో సగ భాగాన్ని పాత బిల్లుల బకాయిలకు చెల్లించాలని, మిగతా సగ భాగాన్ని పరిపాలనా అవసరాలకు వినియోగించాలని సూచించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ వెళ్లి ఆయా పంచాయతీల కార్యదర్శులను కలిసి బిల్లుల చెల్లింపు గురించి అడిగాడు. అయినప్పటికీ వారు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. విసిగిపోయిన అతడు.. తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాడు. పురుగులమందు డబ్బాను కూడా వెంట తెచ్చుకున్నాడు.
బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అతడి కుటుంబ సభ్యులంతా కలిసి కార్యాలయ గుమ్మానికి అడ్డుగా సాష్టాంగంగా పడుకొని నిరసన తెలిపారు. కొద్దిసేపటికి లేచి పురుగులమందు తాగే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సదరు కాంట్రాక్టర్ మాట్లాడుతూ.. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల తన ఇల్లు కూడా అమ్ముకున్నానని, ఇప్పుడు కుటుంబం కూడా గడవని పరిస్థితి ఏర్పడిందని, కార్యదర్శులేమో బిల్లులు ఇవ్వబోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయంపై ఎంపీడీవో ముత్యాలరావు స్పందిస్తూ.. జాలే శ్రీనివాసరెడ్డి చేసిన పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (ఎంబీ) రికార్డులను పరిశీలిస్తామని, అవకాశం మేరకు చెల్లింపులు చేస్తామని అన్నారు.