బూర్గంపహాడ్, ఏప్రిల్ 3: కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, ఎండీ యాకూబ్పాషాలు స్పష్టం చేశారు. సారపాక ఐటీసీ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 9వ రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ 13వ వేతన ఒప్పంద కాలం గడువు పూర్తయి నాలుగు రోజులు కావస్తున్నా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. కార్మికుల సమస్యలపై ఐటీసీ యాజమాన్యం చొరవ చూపించాలని, చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందాన్ని జేఏసీ నాయకులతో కలిసి చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీక్షల్లో కాంట్రాక్టు కార్మికులు తేజావత్ నరేశ్, కట్టా విశ్వేశ్వరరావు, నర్సింహారావు, ఆంబోతు సురేశ్, కుందూరు వెంకటేశ్వరరెడ్డి, కాటం పాపిరెడ్డి, జేఏసీ సభ్యులు రామిశెట్టి లక్ష్మి, చుక్కపల్లి బాలాజీ, దాసరి ప్రశాంత్ నాయుడు తదితరులు కూర్చున్నారు.