బూర్గంపహాడ్, ఏప్రిల్ 4 : వేతన ఒప్పందంతోపాటు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం పదో రోజుకు చేరాయి. దీక్షల్లో చుక్కపల్లి సుభాస్కరరావు, వల్లంకొండ సత్యం, దారావత్ రమేశ్, దాసరి రాంబాబు, యారం రాజశేఖరరెడ్డి, మనూరి రామకృష్ణ, దాసరి ప్రశాంత్, కొమెరెల్లి సతీశ్‌లు కుర్చొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బల్లెం నాగయ్య, ఎండీ యాకూబ్‌పాషాలు మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 13వ వేతన ఒప్పందంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని, 14వ వేతన ఒప్పందాన్ని జేఏసీతో కలిసి చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. శిబిరంలో జేఏసీ సభ్యులు మర్రి వెంకటరెడ్డి, బత్తుల గోపాలరావు, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, అక్కాని సర్వేశ్వరరావు, సూరిశెట్టి జగదీశ్, కోడి శ్రీను, గుప్తా ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.