భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 18 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) సంఖ్య 233కు పెరిగింది. ఇప్పటి వరకూ ఈ సంఖ్య 220గా ఉంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను, మరో ఏడు గ్రామాలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయడంతో అంతకుముందు ఆయా మండలాల పరిధిలో ఉన్న మూడు ఎంపీటీసీ స్థానాలు కనుమరుగయ్యాయి. అలాగే, మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న అశ్వారావుపేటను అప్‌గ్రేడ్ చేసి దానిలో మరో రెండు పంచాయతీలను విలీనం చేసి అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. దీంతో అక్కడ కూడా అంతకుముందే ఉన్న ఆరు ఎంపీటీసీ స్థానాలు కనుమరుగయ్యాయి. ఇక, మండల ప్రజా పరిషత్గా ఏర్పాటు చేసిన భద్రాచలంలో 14, మళ్లీ ఒకే పంచాయతీగా పునరుద్ధరించిన సారపాకలో ఆరు చొప్పున ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.
గుండాల, ఆళ్లపల్లిలో కూడా ఒక్కోటి చొప్పున మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు పెరిగాయి. దీంతో జిల్లాలో ఎంపీటీసీ స్థానాల సంఖ్య 233కు చేరింది. మేజర్ గ్రామ పంచాయతీ భద్రాచలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మండలంగా మార్చింది. దీంతో అక్కడ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఏర్పాటైంది. అలాగే ఇటీవలి వరకూ మండలంగా ఉన్న అశ్వారావుపేటను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో అశ్వారావుపేట మండల పరిషత్ తెరమరుగైంది.
అక్కడి గుర్రాలగూడెం, పేరాయిగూడెం పంచాయతీలను కూడా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కలిపింది. దీంతో అక్కడ ఆరు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ఇక సుజాతనగర్ మండల కేంద్రంతోపాటు ఆ మండలంలోని ఏడు పంచాయతీలైన నాయకులగూడెం, మంగపేట, కోమటిపల్లి, నిమ్మలగూడెం, నర్సింహసాగర్, లక్ష్మీదేవిపల్లిలు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో కలిశాయి. దీంతో ఇక్కడ మూడు ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి.
గత ఎన్నికల సమయం వరకు భద్రాచలం మండలం లేకపోవడం వల్ల జిల్లా మొత్తం 220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఎంపీటీసీ స్థానాలు 233కు పెరిగాయి. అశ్వారావుపేట మండలంలో 6, సుజాతనగర్ మండలంలో 3 కలిపి మొత్తం 9 స్థానాలు తగ్గాయి. అదే సమయంలో కొత్తగా ఏర్పాటైన భద్రాచలం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు, సారపాక పట్టణం మళ్లీ ఏక పంచాయతీగా ఏర్పడడంతో అక్కడ 6 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. ఇక ఆళ్లపల్లి మండలంలో ఒకటి, గుండాల మండలంలో మరొకటి పెరిగాయి. ఇవన్నీ కలిపి 22 స్థానాలకు చేరడంతో జిల్లాలో మొత్తం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సంఖ్య 233కు చేరింది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎంపీటీసీ స్థానాలు పెరిగినా ఓటర్ల సంఖ్య మాత్రం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో జిల్లాలో 7,68,805 మంది ఓటర్లున్నారు. చేర్పులు మార్పుల కారణంగా ఇప్పుడు ఓటర్ల సంఖ్య 6,81,220కు తగ్గింది. అయితే, ఎన్నికల సమయానికి కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటే ఈ సంఖ్య మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో అదనంగా మరో జడ్పీటీసీ స్థానం కూడా పెరిగింది. అదే.. భద్రాచలం జడ్పీ స్థానం. కొత్తగా భద్రాచలం జడ్పీ స్థానం రావడంతో జిల్లాలో ఇప్పటి వరకూ ఉన్న 21 మండలాలు ఇప్పుడు 22 మండలాలు అయ్యాయి.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, అశ్వారావుపేట మున్సిపాలిటీ ఏర్పాటు కావడంతో కొత్తగూడెం, అశ్వారావుపేట, సుజాతనగర్ మండల కేంద్రాలు కనుమరుగు కానున్నాయి. ఈ మండలాల్లో ఈ మండల కేంద్రాలు మినహా మిగిలిన గ్రామాలతో కొత్త మండల కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో సుజాతనగర్ మండల కేంద్రం మారుతుంది. అక్కడ మండల పరిషత్ కార్యాలయానికి సొంత భవనం లేదు కాబట్టి వేరే చోట నిర్మించవచ్చు. అశ్వారావుపేటలో సొంత భవనం ఉంది కాబట్టి దానిని మార్చకపోవచ్చు. కొత్తగా భద్రాచలం మండలం కావడంతో అక్కడ ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో విభజనను పూర్తి చేశాం.
-నాగలక్ష్మి, జడ్పీ సీఈవో, భద్రాద్రి