లక్ష్మీదేవిపల్లి, అక్టోబర్ 26 : ‘ఒకే రాష్ట్రం.. ఒకే పోలీస్’ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం, చాతకొండకు చెందిన ఏఆర్ 6వ బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు లక్ష్మీదేవిపల్లిలో శనివారం ప్ల కార్డులతో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి ప్రధాన రహదారిపై సుమారు 800 మంది బైఠాయించి ఆందోళనకు దిగారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష, ఒకే ఈవెంట్, ఒకే యూనిఫాం అంటూ ప్లకార్డులు పట్టుకొని నినదించారు.
దీంతో గంటసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న పోలీస్ అధికారి ఓ కానిస్టేబుల్‌ను తోసివేయడంతో పోలీస్ కుటుంబాలు కొంత అసహనానికి లోనయ్యారు. సమస్యలపై ధర్నా చేస్తున్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడం సమంజసం కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు మహిళలు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా పదే పదే బదిలీలు చేపట్టకుండా ఐదేళ్లపాటు ఒకేచోట పోస్టింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పొరుగు రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల మాదిరిగా పోలీసు విధానాన్ని అనుసరించాలని వారు కోరారు.