కొత్తగూడెం క్రైం, ఆగస్టు 25: భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఈనెల 28న జరిగే కానిస్టేబుల్ రాత పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కేఎస్ఎం కళాశాలలో గురువారం పరీక్షల రీజినల్ కో-ఆర్డినేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్స్, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలకు నోడల్ అధికారిగా ఏఆర్ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు వ్యవహరిస్తారన్నారు. కేవలం కొత్తగూడెం, పాల్వంచ పరిధిలోని 39 పరీక్షా కేంద్రాలు కేటాయించామని, ఆయా కేంద్రాల్లో 14,221 మంది పరీక్ష రాస్తారన్నారు.
భద్రాచలంలోని 10 కేంద్రాల్లో 2,856 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తారన్నారు. కొత్తగూడెం, పాల్వంచ కేంద్రాలకు మైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పున్నం చందర్, భద్రాచలం కేంద్రాలకు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ భద్రయ్య రీజినల్ కో-ఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారన్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక అబ్జర్వర్‌ను నియమించామన్నారు. సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, భద్రాచలం ఏఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర్ బాబు, పాల్వంచ డీఎస్పీ తాళ్లపెల్లి సత్యనారాయణ, ఏఆర్ డీఎస్పీ కేవీఆర్ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు రమాకాంత్, స్వామి, నాగరాజురెడ్డి, మడిపెల్లి నాగరాజు, ఆర్ఐలు సోములునాయక్, కామరాజు, దామోదర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.