ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 19 : మనిషి తన జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో చదువుదే కీలకపాత్ర. ఈ చదువులో ఉన్నత విద్య ఎంతో కీలకం. ఈ ఉన్నత విద్యలోని పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల భవితే మరింత ఉజ్వలంగా ఉంటుంది. చదువులో ఉత్తమంగా రాణించేందుకు ఇదే తొలిమెట్టు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టి పదో తరగతి పరీక్షలపైనే ఉంటుంది. అయితే మరో రెండు నెలల్లో పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. సిలబస్ చివరి దశలో ఉండడంతో ఉపాధ్యాయులు సన్నద్ధత ప్రారంభించారు. ఈ నెలాఖరులోపు పాఠ్యప్రణాళికను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు విద్యాశాఖ కూడా ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. మార్చిలో జరగబోయే పరీక్షలకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది.
టెన్త్ పబ్లిక్ పరీక్షలపై జిల్లాలోని హెచ్ఎంలతో కలెక్టరేట్లో ఈ నెల 24న కలెక్టర్ వీపీ గౌతమ్ సమీక్షించనున్నారు. పూర్తయిన పాఠ్యాంశాలు, ప్రగతిపై చర్చించి సూచనలు చేయనున్నారు. సబ్జెక్టు నిపుణుల బృందాలు ఈ నెల 25 నుంచి కా ర్యాచరణ మొదలు పెట్టనున్నాయి. అలాగే, టెన్త్ పరీక్షల్లో రాష్ట్రంలో జిల్లాను ఉత్తమమైన స్థానంలో నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలుపరుస్తున్నా రు. కలెక్టర్ వీపీ గౌతమ్, డీఈవో సోమశేఖరశర్మలు కలిసి నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఈ దఫా భిన్నమైన కార్యాచరణను చేపట్టనున్నారు. ప్రతి మండలంలోనూ నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో ఒక బృందాన్ని తయారు చేస్తారు. అలా జిల్లావ్యాప్తంగా 21 బృం దాలను ఎంపిక చేస్తారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టు టీచర్లు ఆ బృందంలో ఉండనున్నారు.
సబ్జెక్టు నిపుణులతో ఏర్పాటు చేసిన బృందాల సభ్యులు వారంలో ఒక రోజు క్లస్టర్ పరిధిలోని పాఠశాలల విద్యార్థులందరినీ ఒక దగ్గరకు చేర్చనున్నారు. విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో ఏయే అంశాల్లో ఏయే తప్పులు చేయడం వల్ల మార్కులు కోల్పోతారో, ఏయే అంశాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల మంచి గ్రేడింగ్ పాయింట్లు సాధిస్తారో అనే విషయాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతోపాటు సబ్జెక్టు నిపుణులు విద్యార్థులకు వివరిస్తారు. అలాగే, వీరితోపాటు డీ, ఈ గ్రేడ్ విద్యార్థులపైనా ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల ఎస్జీటీలతో పాఠాలు బోధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సబ్జెక్టు నిపుణులతో కూడిన బృందాలు ప్రత్యేక చొరవ తీసుకుని బోధించనున్నారు.
టెన్త్ ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపి వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. పరీక్షలకు రెండు నెలల సమయమే ఉన్నందున దీనిని సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా ప్రతీ వారం ప్రత్యేక పరీక్షలు, అలాగే ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలు పూర్తయ్యాయి. వీటిల్లో వచ్చిన గ్రేడుల ఆధారంగా విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తిస్తాం. వెనుకబడిన వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. తాజాగా ప్రతీ మండలంలో సబ్జెక్టు నిపుణులతో ఒక టీమును తయారుచేస్తున్నాం. ఆ మండలంలోని విద్యార్థులందరికీ సబ్జెక్టుల్లోని సులువైన, కఠినమైన అంశాలపై అవగాహన కల్పిస్తాం.