బోనకల్లు, ఆగస్టు 12 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉండాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు పిలుపునిచ్చారు. ముష్టికుంట్ల గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ అధ్యక్షుడు దొప్పా కృష్ణ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నదని ఆరోపించారు. గూడు లేని ఎందరో నిరుపేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నా.. వారికి నిరాశే మిగులుతుందన్నారు.
ఇందిరమ్మ కమిటీల పేరుతో రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థను ప్రారంభించారని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, హామీలు నెరవేర్చేంత వరకు బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందన్నారు. కొందరు స్వార్థ నాయకులు పార్టీని వీడి వెళ్తున్నారని, వారి వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాంటి నష్టం లేదన్నారు. చైతన్యవంతమైన ఈ గ్రామంలో అన్ని పార్టీలు ఏకమైనప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసిందని ఆయన గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం రోడ్లపై తిరిగే పరిస్థితి లేదని, ఆయన ఆకాశంలో ఎగిరే హెలికాప్టర్లలో మాత్రమే ప్రయాణిస్తారని ఎద్దేవా చేశారు.
పాలనను పక్కన పడేసి, గత కేసీఆర్ ప్రభుత్వంపై భట్టివిక్రమార్క అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ 18 నెలల పాలనలో రూ.9 వేల కోట్లు అప్పు చేసిందని, ప్రభుత్వం దిగే నాటికి ఎన్ని వేల కోట్లు అప్పు చేస్తుందో కాంగ్రెస్ మంత్రులకే తెలియాలన్నారు. కార్యకర్తలు, నాయకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, పారా ప్రసాద్, కొనకంచి నాగరాజు, బంధం నాగేశ్వరరావు, షేక్ హుస్సేన్, షేక్ జానీ, షేక్ ఇబ్రహీం, పర్వతాచారి, పండుగ గోపాలరావు, బాలు, శ్రీను, షేక్ నజీర్, షేక్ చాంద్‌పాషా, బొడ్డుపల్లి సాయి, షేక్ మస్తాన్, దొడ్డ అచ్చమ్మ, కొట్టే నరేశ్, దొప్పా ప్రసాద్, గద్దల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.