ముదిగొండ, జనవరి 19: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. మండలంలోని పమ్మి గ్రామంలో ఆదివారం ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని, కలిసివచ్చే శక్తులతో జతకట్టి అధికార పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగింది శూన్యమని, ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయకుండా కాలం వెల్లదీస్తున్నదని విమర్శించారు.
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని తూర్పారబట్టారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహా అన్ని ఏ ఒక్క పథకంపైనా స్పష్టత లేకుండా సర్వేల పేరుతో కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటోందని ఆరోపించారు. పథకాల పేరుతో వంచన చేయాలని చూస్తుందని విమర్శించారు. ఈ నెల 21 నుంచి 24 వరకూ జరిగే గ్రామసభల్లో అర్హులందరికీ పథకాలు అందేలా ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రభుత్వ వైఫల్యాలపై విస్తృత ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపునిచ్చారు. టీఎస్ సీడ్స్ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేశ్వర్లు, బంక మల్లయ్య, హరిప్రసాద్, ఉపేందర్ పాల్గొన్నారు.