రఘునాథపాలెం, జూలై 9: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని పల్లెల్లో కాంగ్రెస్ నాయకులు తెగ హడావిడి చేస్తున్నారు. ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ తాము కీలకంగా ఉన్నామని; స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీలో ఉండాలంటే ప్రభుత్వ పథకాలను పేదలకు తామే మంజూరు చేయించినట్లుగా ఫోజులు కొట్టాలని, తద్వారా బెర్తులు ఖరారు చేసుకొని ఆ తరువాత ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలని తెగ ఆరాట పడుతున్నారు. ఇందుకోసం గ్రామాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్నారు.
ఏకంగా అధికారాన్నే చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా గ్రామంలో పెద్ద ఎత్తున సభ పెట్టి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను కూడా వారే పంపిణీ చేస్తున్నారు. అధికారుల సంతకాలు లేని పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్నారు.అయితే, అధికారులు లేకుండా సభ పెట్టి పంపిణీ చేస్తుండడంపై గ్రామస్తుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోనిది మంచుకొండ గ్రామం. ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడొకరు గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం పెద్ద ఎత్తున సభ పెట్టాడు. గ్రామంలో 80 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారులందరూ సభ వద్దకు వచ్చి మంజూరు పత్రాలు తీసుకోవాలని గ్రామంలో ప్రచారం చేయించాడు. లబ్ధిదారులందరినీ ఆ సభ వద్దకు పిలిపించి ఏకంగా అతడే ఆ మంజూరు పత్రాలను పంపిణీ చేశాడు. అయితే, ‘ప్రభుత్వాధికారులెవరూ లేకుండా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసే అర్హత కాంగ్రెస్ నాయకుడికి ఉందా? అసలు ఈ పత్రాలు ఈ నాయకుడి చేతికి ఎలా వచ్చాయి? అసలివి నిజమైనా పత్రాలేనా? లేక ప్రజలను మభ్యపెట్టేందుకు సొంతంగా తయారు చేయించి తెచ్చాడా?’ అంటూ కొందరు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు.
పైగా, సదరు కాంగ్రెస్ నాయకుడు పంపిణీ చేసిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలపై అధికారుల సంతకాలు లేవని, ఆ పత్రాలు కూడా జిరాక్స్ కాపీలేనని ఇంకొందరు గ్రామస్తులు గుర్తించారు. అదీగాక.. ఆ పత్రాలన్నీ ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామానికి చెందినవి. కానీ పత్రాల్లో మాత్రం మంచుకొండ గ్రామం.. పొరుగునే ఉన్న పాలేరు నియోజకవర్గంలోని గ్రామం అన్నట్లు ముద్రితమై ఉండడం గమనార్హం.
అంతేగాక, బుధవారం పంపిణీ చేసిన ఈ పత్రాలన్నీ ఈ ఏడాది మే 24న అప్పటి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ద్వారా జారీ అయినట్లుగా ఉన్నాయి. కానీ పంపిణీ మాత్రం బుధవారం జరిగింది. అయితే, వాటిని జారీ చేసిన కలెక్టర్ ఇప్పటికే బదిలీ అయి వెళ్లిపోగా.. ప్రస్తుతం అనుదీప్ కలెక్టర్గా ఉన్నారు. మరి, కలెక్టర్గా అనుదీప్ ఉండగా.. ముజమ్మిల్ ఖాన్ పేరిట జారీ అయిన మంజూరు పత్రాలను ఎలా పంపిణీ చేస్తారని, అది కూడా సుమారు నెలన్నర కిత్రం నాటి తేదీతో ఉన్న జిరాక్స్ పత్రాలను ఎలా పంపిణీ చేస్తారని, అవి ఏ మేరకు చెల్లబాటు అవుతాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.