మండల స్థాయిలోనే ప్రజా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినా సమావేశాల నిర్వహణ ఎట్లా అన్నదానికి స్పష్టతనివ్వలేదు. సమావేశాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించకపోవటంతో చాయ్, బిస్కెట్ల ఖర్చులు కూడా మండల అధికారుల జేబుల్లో నుంచే వెచ్చించాల్సి వస్తున్నది. మండల పరిషత్ అధ్యక్షులు లేకపోవటంతో ఎంపీడీవోలే నోడల్ ఆఫీసర్లుగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మండల పరిషత్ పాలకవర్గాలు గడువు ముగియటంతో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ ఫైనాన్స్ నిధులు ఇవ్వటం లేదు. దీంతో అటు ప్రజావాణి సమావేశాలు, ఇటు మండల పరిషత్ సమావేశాల నిర్వహణ భారంగా మారటంతో ఎంపీడీవోలు అంతర్మధనంతో కొట్టుమిట్టాడుతున్నారు. -అశ్వారావుపేట, ఆగస్టు 23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మండల పరిషత్ కార్యాలయాలను నిధుల కొరత తీవ్రంగా వెంటాడుతున్నది. ఈ దశలోనే రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలోనే ప్రజల సమస్యలు పరిష్కరించాలని, ఎంపీడీవోలు నోడల్ ఆఫీసర్‌గా ‘ప్రజావాణి’ నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లావ్యాప్తంగా గత సోమవారం(ఈ నెల 17వ తేదీన) 23 మండలాల్లో ఎంపీడీవోలు ప్రజావాణి నిర్వహించారు. ఇప్పటికే కార్యాలయాల నిర్వహణ ఆర్థిక భారం కాగా తాజాగా ప్రజావాణి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించటంతో ఎంపీడీవోలు అంతర్మథనంలో పడ్డారు.
కనీసం చాయ్, బిస్కెట్ ఖర్చులకు కూడా ఎంపీడీవోలే తమ జేబుల్లో నుంచి డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రజావాణి సమావేశాలకు మండలంలోని అన్నిశాఖల అధికారులు హాజరవుతారు. 2024 జూన్ 3వ తేదీన మండల పరిషత్, 4వ తేదీన జిల్లా పరిషత్ పాలకవర్గాల ముగిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ ఫైనాన్స్ నిధులను ఇవ్వటంలేదు. వాస్తవానికి గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే 15వ ఆర్థిక సంఘంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే స్టేట్ ఫైనాన్స్ నిధులు ఎంతగానో దోహదపడేవి.
గత రెండేళ్లుగా ఈ నిధులేమీ లేకపోవడంతో మండల పరిషత్‌లు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే వరకు నిధులు విడుదల చేయమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తికావటంతో కేంద్ర ప్రభుత్వం నిధులను నేరుగా వాటి ఖాతాల్లోనే జమ చేస్తున్నది. కానీ మండల పరిషత్‌లకు నిధులు విడుదల చేయడం లేదు. ప్రజావాణి, మండల పరిషత్ సమావేశాల నిర్వహణ ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుందంటూ ఎంపీడీవోలు మదనపడుతున్నారు.
పరిషత్ సమావేశాలు మరింత భారం
ఇదిలా ఉండగా మండల పరిషత్ సమావేశాలు ఎంపీడీవోలకు మరింత భారంగా మారాయి. పాలకవర్గాల గడువు ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవటంతో సుమారు రెండేళ్లపాటు సమావేశాలు జరగలేదు. దీంతో పల్లెల సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ప్రజాప్రతినిధులకు లేకుండాపోయింది. కొద్దినెలల క్రితం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి కావటంతో సర్పంచులు కొలువుదీరారు. తాజాగా ప్రభుత్వం మండల పరిషత్ సమావేశాలు ప్రతి 45రోజులకు ఒకసారి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో మూడు నెలలకు ఒకసారి సమావేశాలు జరిగాయి. అప్పుడు ఎంపీపీ అధ్యక్షత వహించగా ఇప్పుడు మండల ప్రత్యేకాధికారి నేతృత్వంలో సమావేశాలు జరుగుతున్నాయి. వీటి నిర్వహణ సైతం అధికారులకు తలకుమించిన భారమైంది. వీటికీ ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించలేదు.
ప్రజల‘వాణి’ వింటారా..?
సమస్యలపై ప్రజల వాణిని అధికారులు వింటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలపై ఎప్పటికప్పుడు దరఖాస్తులు చేసుకున్నా పరిష్కారం లభించకపోవటంతోనే జిల్లా అధికారులను కలుస్తున్న ప్రజలు ఇప్పుడు మండల స్థాయిలోనే మళ్లీ ప్రజావాణి నిర్వహించటం పట్ల పెదవి విరుస్తున్నారు. అక్కడ స్పందనలేకనే జిల్లా అధికారుల వద్దకు వెళ్లాల్సివస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసేలా కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రభుత్వం ప్రత్యేక యూజర్ ఐడీ, పాస్వర్డ్లు క్రియేట్ చేసింది. ఆన్లైన్లో నమోదు చేసినా.. సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి అధికారులకు లేకపోతే ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మండలస్థాయిలో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న పూర్తి భరోసా ప్రజలకు కలగటం లేదు. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో సుమారు 32శాఖల అధికారులు పాల్గొంటే కేవలం 20లోపు ఫిర్యాదులే అందటం ఇందుకు నిదర్శనం.
ప్రత్యేకంగా నిధులు లేవు..
ప్రజావాణి సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇంకా కేటాయించలేదు. ప్రస్తుతం సొంతంగానే సాధారణ ఖర్చులు భరిస్తున్నాం. ముఖ్యంగా ఫిర్యాదులు తీసుకొచ్చే ప్రజలకు తాగునీటి సౌకర్యం, సమావేశాలకు హాజరయ్యే అధికారులకు చాయ్, బిస్కెట్ల కోసం జేబుల్లో నుంచే ఖర్చు చేస్తున్నాం. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అన్నిశాఖల అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు.
-వాల్మీకి కిశోర్, ఎంపీడీవో, అశ్వారావుపేట