భద్రాచలం/ దుమ్ముగూడెం/ చర్ల, అక్టోబర్ 12 : ఇసుక ఆదాయం కోసం పూడికతీత పేరుతో టీఎస్ఎండీసీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇవ్వడంతో గోదావరి పరీవాహకంలోని భద్రాచలం నియోజకవర్గానికి ఇసుక లారీలు దండెత్తాయి. నిత్యం వేలాది లారీలతో తెలంగాణ, ఏపీకి చెందిన ఇసుక వ్యాపారులు దండయాత్ర చేస్తున్నారు. దీంతో భద్రాచలం నుంచి చర్ల వరకూ సుమారు 55 కిలోమీటర్ల మేర ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది.
ప్రభుత్వం చేసిన విధ్వంసంతో ఆనవాళ్లు కోల్పోయింది. వందలాది ఇసుక లారీల అధిక లోడు కారణంగా రహదారిపై డాంబర్ కొట్టుకుపోయి మట్టి తేలింది. లోతైన పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో లారీలు వాటిల్లో దిగబడుతున్నాయి. ఇతర వాహనాల రాకపోకలు ఆటంకం కల్పిస్తున్నాయి. ఆ గుంతలు, ఇసుక లారీల రద్దీ, దుమ్మూధూళీ కారణంగా ఇతర వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఇసుక లారీలు ఢీకొన్ని మృత్యువాత పడిన పశువుల సంఖ్యకు లెక్కే లేదు.
ఐదు ర్యాంపుల్లో ఉన్న ఇసుక కోసం భద్రాచలం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్ల వరకు ఇసుక లారీలు క్యూలైన్లలో బారులు తీరుతున్నాయి. ఈ మార్గంలో రోడ్ల వెంటా, రోడ్లపైనా కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఇసుక లారీలే. వీటి కారణంగా ఈ మార్గంలో ఇప్పటికే రోడ్లు ధ్వంసమయ్యాయి. భద్రాచలం నుంచి వాజేడు వరకూ 120 కిలోమీటర్ల మేర ఉన్న ఈ మార్గం ఇక్కడి ప్రజలకు ఎంతో కీలకం. ఇలాంటి ఈ రోడ్డు ధ్వంసం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
అయితే, గడిచిన మూడు రోజులుగా ఈ రహదారిపైకి వేలాది లారీలతో ఏపీ, తెలంగాణకు చెందిన ఇసుక వ్యాపారులు దండయాత్ర చేశారు. దీంతో రహదారినంతటినీ ఈ ఇసుక లారీలే ఆక్రమించడంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. భద్రాచలం చర్ల మధ్య సాధారణ రోజుల్లో గంటన్నర సమయంలో ముగిసే ప్రయాణం ఈ ఇసుక లారీల కారణంగా, రహదారి ధ్వంసమైన కారణంగా సుమారు ఐదు గంటలు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము ఇలాంటి నరకం ఎన్నడూ అనుభవించలేదని గుర్తుచేస్తున్నారు.
కలివేరు, కుదునూరు, సుబ్బంపేట, గొల్లగూడెం గ్రామాల వద్ద ఇసుక లోడు కోసం వందలాది లారీలు రోడ్లపైన, రోడ్ల పక్కన నిలిచి ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ చక్రబంధం ఏర్పడుతోంది. చివరకు అత్యవసర సేవలందించే అంబులెన్సులు వెళ్లి వచ్చేందుకు కూడా సైతం దారి దొరకని దయనీయ స్థితి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఎటపాక నుంచి ఇసుక ర్యాంపుల వరకు లారీలన్నీ రోడ్లపైనే కిక్కిరిసి ఉన్నాయి. వాటిని చాలా వరకూ పర్ణశాల వెళ్లే భక్తులు వెనుదిరిగారు. ఆటోలు వాలాలు సైతం ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లే సాహసం చేయలేకపోయారు.
చర్ల మండలంలో పూడికతీత (డిస్టిలేషన్) పేరుతో ప్రభుత్వం ఇస్టానుసారం ఇసుక ర్యాంపులకు అనుమతులిచ్చింది. చర్ల మండలంలో ఆరు ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఒక్కో క్వారీలో 6 లక్షల నుంచి 10 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక తీసేందుకు అనుమతులున్నాయి. దీంతో ఏపీ, తెలంగాణకు చెందిన ఇసుక వ్యాపారులు వేలాది లారీలతో గద్దల్లా వాలిపోయారు. ఇటు భద్రాచలం నుంచి చర్ల వరకూ, అటు వెంకటాపురం నుంచి చర్ల వరకూ వేలాది లారీలు రోడ్ల వెంట ఉండి ఇతర వాహనాలు ప్రమాదాల గురయ్యేందుకు కారణమవుతున్నాయి. రోడ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఈ ఇసుక లారీల అధిక లోడు కారణంగా తేగడ వద్ద ఉన్న తాలిపేరు వంతెన కూడా దెబ్బతింటోంది.
భద్రాచలం, అక్టోబర్ 12: ‘ఈ ఇసుక లారీల విధ్వంసం వల్ల మేం చావాలా? బతకాలా?’ అంటూ ఏపీలోని చింతలగూడెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేయింబవళ్లూ తిరుగుతున్న ఈ ఇసుక వల్ల తాము ప్రమాదాల భారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు చర్ల నుంచి వచ్చే ఇసుక లారీలను ఎటపాక మండలం చింతలగూడెం, కన్నాయిగూడెం, సీతంపేట గ్రామస్తులు శనివారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. ఇసుక లోడుతో ఉన్న రెండు లారీలు చర్ల ప్రధాన రహదారిపై చింతలగూడెం వద్ద దిగబడడంతో ఆ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అప్పటికే ఆగ్రహంగా ఉన్న కన్నాయిగూడెం, చింతలగూడెం, సీతంపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎటపాక పోలీసులు అక్కడి చేరుకొని గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులతోనూ గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అప్పటికే వందల సంఖ్యలో లారీలు రోడ్డుపై నిలిచిపోవడంతో అటు భద్రాచలం వైపు, ఇటు చర్ల వైపు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బురదలో కూరుకుపోయిన రెండు లారీలను బయటకు పోలీసులు క్రేన్లతో ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం మధ్యాహ్నం వరకు లారీల్లో ఉన్న ఇసుకను తొలగించి రెండు లారీలను బయటకు తీశారు.