ప్రజాకవి గోరటి వెంకన్న పాడినట్లుగా.. కాంగ్రెస్ పాలనలో పల్లెలు మరోసారి కన్నీరు పెడుతున్నట్లుగా కన్పిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాల విషయంలో ఈ విషయం స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. నగరాలు, పట్టణాల మాదిరిగానే పల్లె ప్రజలకూ ఆహ్లాదాన్ని అందించాలనీ, పచ్చదానాన్ని పంచాలనీ సంకల్పించింది నాటి కేసీఆర్ సర్కారు. అందుకోసం ప్రతి పల్లెలోనూ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేసింది. ఈ పల్లె పార్కుల్లో సాయంత్రం వేళల్లో నాడు గ్రామీణులందరూ సేదదీరేవారు. అదే పార్కుల్లోని , నర్సరీల్లోని మొక్కలకు, చెట్లకు నిత్యం నీళ్లు పట్టేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీకి ఒక ట్యాంకర్‌ను కూడా ఏర్పాటుచేసింది.
ఆ ట్యాంకర్లతో పంచాయతీ సిబ్బంది ప్రతి రోజూ ఆయా మొక్కలకు నీళ్లు పట్టడంతో అవి పచ్చదనాన్ని పంచేవి. దీంతో ఆయా ప్రకృతివనాల్లో ఉదయం వేళల్లో గ్రామస్తులు వాకింగ్ చేసేవారు. సాయంత్రం వేళల్లో మహిళలు, చిన్నారులు ఆహ్లాదాన్ని ఆస్వాదించేవారు. కానీ కేసీఆర్ చేపట్టిన పథకాలు, కార్యక్రమాల ఆనవాళ్లు కూడా ఉండకూడదన్న ధోరణితో ఉన్న ప్రస్తుత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు పల్లె ప్రకృతి వనాలనూ పగబట్టింది. వాటి పర్యవేక్షణను పక్కనబెట్టింది. దీంతో ప్రస్తుతం అవి చిట్టడవులను, ముళ్లపొదలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని గమనించిన ఆయా గ్రామాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
-భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 2 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లె పార్కులు కళతప్పాయి. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 481 గ్రామ పంచాయతీల్లో గత కేసీఆర్ ప్రభుత్వం పల్లెప్రకృతి వనాలను ఏర్పాటుచేసింది. ఇన్నాళ్లూ పచ్చందాలను పంచిన పల్లె పార్కులు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నాయి. ఎండిపోయిన మొక్కలు మోడు వారిన కొమ్మలతో పోకిరీ గాళ్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. సాయంత్రమైతే మందుబాబుల విందులకు నిలయాలుగా మారాయి. వాటి పర్యవేక్షణ కోసం పంచాయతీ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
భద్రాద్రి జిల్లాలో 481 గ్రామ పంచాయతీల్లో 1,280 పల్లెప్రకృతి వనాలను గత కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. కనీసం అర ఎకరం స్థలంలో 1,500 మొక్కలను నాటించి పచ్చని వాతావరణాన్ని కల్పించింది. ఈ పార్కుల్లో స్థానికంగా ఉండే గ్రామస్తులు, మహిళలు వాకింగ్ చేస్తూ సరదాగా గడిపేవారు. ప్రస్తుతం ఆ పార్కుల్లోని మొక్కలు, చెట్లు ఎండిపోవడంతో కళావిహీనంగా మారాయి. కొన్ని గ్రామాల్లో అడవిని తలపిస్తున్నాయి. దీంతో గ్రామస్తులు ఆయా పార్కుల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దుమ్ముగూడెం మండలం అంజిపాకలో చెట్లు కూడా కనబడడం లేదు. చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్, చండ్రుగొండ మండలం మద్దుకూరు, గానుగపాడు, సుజాతనగర్ మండల కేంద్రంలోని ప్రకృతి వనాలు మరింత అధ్వాన్నంగా మారాయి.
పల్లె ప్రకృతి వనాలపై సంరక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. పల్లె పార్కులు, నర్సరీల్లోని మొక్కలను నీళ్లు పెట్టేందుకు ఏర్పాటుచేసిన ట్యాంకర్లను కూడా మూలనపడేసింది. దీంతో పార్కుల్లోని మొక్కలన్నీ నీళ్లు లేక చనిపోతున్నాయి. జూలూరుపాడు చింతల్‌తండా, చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్, చండ్రుగొండ మండలం మద్దుకూరులోని ట్యాంకర్లు మూలనపడే ఉన్నాయి.
గత కేసీఆర్ ప్రభుత్వంలో పల్లెప్రకృతి వనా లు పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తుంటే ఎండిపోయిన చెట్లు కనబడుతున్నాయి. పశువులను మేపేందుకు తీసుకెళ్లినా పచ్చగడ్డి కూడా ఉండడం లేదు. పల్లె ప్రకృతి వనాలను చూస్తే బాధేస్తోంది. ట్యాంకర్ ఉన్నా ఉపయోగం లేకుండాపోయింది. నీరు లేకపోవడంతో చెట్లు బతకడం లేదు.
-ఉబ్బ నాగేశ్వరరావు, అంజిపాక, దుమ్ముగూడెం
నేను సర్పంచ్‌గా ఉన్నప్పుడు ప్రతి రోజూ ట్యాంకర్‌తో పల్లె పార్కులోని మొక్కలను నీళ్లు పట్టేవాళ్లం. ఇప్పుడు నీళ్లు పట్టేందుకు గుమస్తా కూడా లేడు. నాలుగు నెలల ఇదే సమస్యలు. పైగా, పంచాయతీ ట్రాక్టర్ కూడా మరమ్మతులతో షెడ్‌కు పోయింది. కనీసం వీధుల్లో చెత్త కూడా తీయడం లేదు. ట్రక్కు, ట్యాంకర్ మూలనపడ్డాయి.
-రాములు, మాజీ సర్పంచ్, చింతల్‌తండా, జూలూరుపాడు
పంచాయతీలకు నిధులు రావడం లేదు. ఇంటి పన్నులు అంతంత మాత్రంగానే ఉంటాయి.ఏజెన్సీప్రాంతం అవడం వల్ల పన్నులు తక్కువగా ఉంటాయి. ట్యాంకర్లు మూలనపడిన మాట వాస్తవమే. నిధులు లేక ఇబ్బందులు ఉన్నాయి. వేసవిలో మొక్కలకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని చేపట్టాలని సెక్రటరీలను ఆదేశించాం.
-చంద్రమౌళి, డీపీవో, భద్రాద్రి