అశ్వారావుపేట/ రఘునాథపాలెం, సెప్టెంబర్ 20 : నాలుక మడత పెట్టే సీఎం రేవంత్ మాటలపై భద్రాద్రి జిల్లా మహిళలు మరోసారి భగ్గుమంటున్నారు. అలవిగాని హామీలతో అధికార పీఠమెక్కిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, పైగా ఇచ్చిన మాటలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని తూర్పారబడుతున్నారు. తాజాగా బతుకమ్మ చీరల విషయంలోనూ వాగ్బాణాలు సంధిస్తున్నారు.
నిరుటి మాదిరిగా ఈ ఏడాది కూడా ఇందిరా మహిళా శక్తి పేరిట స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల్లో సభ్యులైన మహిళలకు మాత్రమే ‘అక్కా చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’గా చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో సంఘాల వెలుపల ఉన్న మహిళలందరూ మండిపడుతున్నారు.
తెలంగాణలోని ఆడబిడ్డలందరూ గత కేసీఆర్ ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలు ధరించి ఆనందభరితంగా బతుకమ్మ ఆడిన రోజులను తాజా బతుకమ్మ వేడుకల వేళ మహిళలందరూ గుర్తు చేసుకుంటున్నారు. బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ఖండాంతరాల్లోని మహిళలూ ఆచరిస్తూ ఆరాధిస్తున్న వేళ దానికి మరింత జీవం పోస్తూ, తెలంగాణలోని 18 ఏళ్లు నిండిన(రేషన్‌కార్డు కలిగిన) ప్రతి ఒక్క మహిళకూ బతుకమ్మ చీర అందిస్తూ, ఆ చీరలు ధరించి పూలపండుగలో లీనమై ఆడిపాడేలా ప్రోత్సహించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జిల్లా ఆడబిడ్డలందరూ జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో ప్రకృతి పండుగగా విరాజిల్లుతున్న బతుకమ్మను చెరిపేందుకు నేటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న చర్యలను అసహ్యించుకుంటున్నారు. ‘అధికారంలోకి రాగానే ఇస్తానన్న రెండేసి చీరలు ఏవి రేవంతన్నా’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
విశ్వయవనికపై తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ పేరును తుడిచిపెట్టాలన్న క్రూరమైన ఆలోచనతోనే బతుకమ్మ చీరలకు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళం పాడుతున్నట్లు ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బతుకమ్మ చీరలు’ అనే పేరు విన్నా, బతుకమ్మ చీరలను అందుకున్నా ఆ ఖ్యాతి అంతా స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. అందుకే నిరుడు కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేయలేదు.
అధికారంలోకి రాగానే రెండు చొప్పున చీరలు ఇస్తామన్న హామీని పక్కన పెట్టారు. కేవలం స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు మాత్రమే అందించారు. ఆ చీరల ప్యాకెట్లపై కూడా ఎక్కడా ‘బతుకమ్మ చీరలు’ అనే పేరు లేకుండా చేశారు. ఈసారి కూడా అదే పనిలో ఉన్నారు. దీంతో తెలంగాణ సాంస్కృతిక వైభవంగా ఉన్న ‘బతుకమ్మ’ను, తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగకు అందించే బతుకమ్మ చీరలకు మంగళం పాడి వాటిని శాశ్వతంగా తెరమరుగు చేయాలని, తద్వారా బతుకమ్మకు బ్రాండ్‌గా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్లుగా మహిళలు ఆరోపిస్తున్నారు.
18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ గత కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందించడంతో వారంతా ఆ చీరలను ధరించి 9 రోజులు బతుకమ్మ వేడుకలను అంగరంగవైభవంగా, ఆనందభరితంగా జరుపుకునేవారు. వాడవాడలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగేవి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ చీరలు అందించకపోవడంతో ఆడబిడ్డలందరూ నిరాశతో ఉన్నారు. ఫలితంగా బతుకమ్మ వేడుకలు కూడా మునుపటంత వైభవంగా జరగడం లేదు. దీనికి కాంగ్రెస్ సర్కారు కుట్ర, నిర్లక్ష్యం తోడు కావడంతో పూల పండుగ ప్రాభవం కూడా సన్నగిల్లుతోంది.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు బదులుగా కేవలం ఎస్‌హెచ్‌జీల్లోని మహిళలకు మాత్రమే చీరలు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆ చీరలు తాజాగా నియోజకవర్గ కేంద్రాలకు కూడా చేరాయి. అయితే, అవి ఎస్‌హెచ్‌జీ మహిళల యూనిఫాం చీరలను కొందరు అధికారులు అంటుండగా.. అవి రేవంతన్న కానుక చీరలు(బతుకమ్మ చీరలు కావు) అని మరికొందరు అధికారులు అంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. భద్రాద్రి జిల్లాలోని 22 మండలాల్లో 981 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి.
వీటి పరిధిలో 22,055 మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో 2,16,257 మంది మహిళలు సభ్యులు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి మాత్రమే ‘రేవంతన్న కానుక’ పేరిట చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కానీ, ఇదే జిల్లాలో ఎస్‌హెచ్‌జీల వెలుపల ఉన్న సుమారు 1.50 లక్షల మంది మహిళల సంగతేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘కేవలం ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఓట్లేస్తేనే కాంగ్రెస్ గెలిచిందా? మా ఓట్లు కావాలిగానీ మాకు మాత్రం చీరలు ఇవ్వరా?’ అంటూ ఎస్‌హెచ్‌జీలకు వెలుపల ఉన్న మహిళలు ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘రేవంతన్న కానుక’ చీరలను ఎస్‌హెచ్‌జీల్లోని మహిళా సభ్యులకు త్వరలోనే పంపిణీ చేస్తాం. ఈసారి బతుకమ్మ కోసం ప్రభుత్వం చీరలను కేటాయించలేదు. ఇందిరా మహిళా శక్తి ద్వారా ఎస్‌హెచ్‌జీ సభ్యురాళ్లకు యూనిఫాం కింద పంపిణీ చేయనున్నాం. వీరి కోసం 2,16,257 చీరలను భద్రాద్రి జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది. వీటిలోల ఇప్పటి వరకు 1.20 లక్షల చీరలు వచ్చాయి.
– విద్యాచందన, డీఆర్డీవో, కొత్తగూడెం
చీరల పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక జిమ్మిక్కులు చేస్తోంది. కేవలం ఎస్‌హెచ్‌జీ మహిళలకేనంటూ మెలికలు పెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క చీర ఇస్తే నాడు గగ్గోలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. తాను సీఎం అయితే ఒక్కో మహిళకు రెండేసి చీరలిస్తానని హామీ ఇచ్చారు. ఎస్‌హెచ్‌జీల వెలుపల ఉన్న మహిళలకు ఇప్పుడు ఎగనామం పెడుతున్నారు.
-సున్నం నాగమణి, మాజీ జడ్పీటీసీ, ములకలపల్లి