సొంత ఇల్లు పేదోడి కల. తిన్నా తినకున్నా ఇల్లు ఉంటే చాలు అంటారు పెద్దలు. అదిగో ఆ ఇంటి కోసం ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. సొంతంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత లేక ప్రభుత్వంవైపు కళ్లు తేరిపారచూస్తున్నారు. సర్కార్ సాయానికి తమ కష్టార్జితాన్ని జతచేసి గూడు నిర్మించుకునేందుకు తాపత్రయపడుతున్నారు. కానీ పేద ప్రజల ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు జల్లుతున్నది. ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకంలో ఇండ్లు మంజూరయ్యాయని చెప్పి అధికారులు లబ్ధిదారులకు పత్రాలు సైతం చేతికిచ్చి మళ్లీ క్యాన్సిల్ చేస్తున్నారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి కొందరు ఉన్న ఇంటిని సైతం కూల్చుకొని లబోదిబోమంటున్నారు. అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఇప్పుడు అనర్హులకే పెద్దపీట వేస్తున్నది. అర్హులకు మొండి‘చేయి’ చూపిస్తున్నది. అదిగో.. ఇదిగో అంటూ మాటలు చెబుతున్నదే తప్ప ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు దాటినా ఇప్పటివరకు ఒక ఇంటికి కూడా పునాది పడలేదన్నది నమ్మలేని నిజం. పైలెట్ గ్రామాల్లో మంగళవారం పర్యటించిన ‘నమస్తే తెలంగాణ’ బృందానికి ఈ విషయాలన్నీ తేటతెల్లమయ్యాయి. లబ్ధిదారులే స్వయంగా బృందం సభ్యులతో ముచ్చటించారు.
– భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 11 (నమస్తే తెలంగాణ)
అది చుంచుపల్లి మండలం పెనుబల్లి పైలెట్ గ్రామం. అక్కడ నాలుగు గ్యారెంటీలు వందశాతం అమలు చేస్తామని అధికారులు గ్రామసభ నిర్వహించారు. కానీ అక్కడ వంద శాతం అమలు చేయలేకపోగా మంజూరైన ఇళ్లలో కోతపెట్టి గ్రామస్తుల మధ్య చిచ్చుపెట్టారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల బాధితులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. పంచాయతీ కార్యాలయానికి వచ్చి గ్రామ కార్యదర్శిని నిలదీస్తున్నారు. ఆ గ్రామంలో మొత్తం 379 దరఖాస్తులు రాగా.. అందులో 154 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. కానీ అందులో 33 మందికే ఇండ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. వారు మాత్రమే అక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేసుకునేందుకు పునాదులు తీసుకున్నారు. మిగతా లబ్ధిదారులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి సమస్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక గ్రామం కాదు ఏకంగా 22 మండలాల్లోని 22 పైలెట్ గ్రామాల్లో ఇలాంటి ఫైటింగ్ నడుస్తున్నది.
పైలెట్‌లో ఫైటింగ్..
అవి పేరుకే అవి పైలెట్ గ్రామాలు. అక్కడ ఇప్పుడు ఫైటింగ్‌లు జరుగుతున్నాయి. ఒక గ్రామం కాదు ఏకంగా 22 గ్రామాల్లో ఇదే పరిస్థితి తయారైంది. అర్హులకు ఇండ్లు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు గ్రామాల్లో ఫైటింగ్‌కు దిగుతున్నారు. పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి కార్యదర్శులను నిలదీస్తున్నారు. గతంలో ఇండ్లు ఇచ్చిన వారికి, డబ్బులు ఉన్నవారికి, పలుకుబడి ఉన్నవారికి ఇండ్లు మంజూరు కావడంతో వారు లబోదిబోమంటున్నారు. కొంతమంది రాజకీయ పలుకుబడితో మంజూరు చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు.
పునాదులుపడని ఇండ్లు..
జాబితాల తయారీలోనే అధికారులు నిమగ్నం అవుతున్నారే తప్ప నేటివరకు ఒక్కరికి సైతం కనీసం పునాది బిల్లు ఇప్పించలేదు. ఖాళీ స్థలాన్ని జియో ట్యాగ్ చేసిన తరువాతనే ఇంటికి ముగ్గు పోసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. అయితే గడిచిన కొద్దిరోజుల నుంచి జియో ట్యాగ్ చేద్దామన్నా సర్వర్ డౌన్ కావడంతో పంచాయతీ అధికారులు లబ్ధిదారులకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇందిరమ్మ ఇండ్లకు పునాదులు పడుతాయా? లేదా? అని ఇప్పటికే పాత ఇండ్లు కూల్చుకొని కొత్త ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు భయపడిపోతున్నారు. వానకాలంలోపు స్లాబ్ వేద్దామని సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల ఆశలు అడియాశలు అవుతున్నాయి.
పలుకుబడి ఉన్నోళ్లకేనా..?
నాలుగు గ్యారెంటీల అమలు కోసం సర్కారు ఏర్పాటు చేసిన గ్రామసభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం జిల్లాలో 82 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందులో పైలెట్ గ్రామాలకు ముందుగా ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసినా అక్కడా అసలైన లబ్ధిదారులకు మొండిచెయ్యి చూపించింది. లక్ష్మీదేవిపల్లి మండలం మైలారం గ్రామంలో 210 మందిని ముందుగా అర్హులుగా చూపించి తర్వాత 164 మందికే ఇండ్లు వచ్చాయని మాటమార్చారు. దీంతో అక్కడ ఉన్న గిరిజనులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అశ్వారావుపేట మండలంలో 106 మందికి మంజూరు చేసి అందులో 53 మందికే ఇండ్లు ఇచ్చారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో 152 మందికి 149 మందినే అర్హులు చేశారు. చండ్రుగొండ మండలంలో 264 మందికి 250 మందికే ఇండ్లు మంజూరు చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అర్హులకు చేయిచ్చి ఉన్నోళ్లకే ఇండ్లు మంజూరు చేశారు. జిల్లాలో 3,500 మందికి పైగా లబ్ధిదారులను గుర్తించి కేవలం 2,459 మందికే ఇండ్లు మంజూరు చేశారు. ఒక గ్రామానికే ఇన్ని కొట్లాటలు జరిగితే అన్ని గ్రామాలకు అమలు చేస్తే ఎన్ని గలాటాలు జరుగుతాయో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
నా ఇల్లు వానకు తడుస్తది..
నా ఇల్లు చూస్తే ఎవరూ లోపలికి కూడా రారు. వానకు ఇళ్లంతా కురుస్తది. పడిపోయే స్థితిలో ఉంది. నాకు భార్య, ఇద్దరు పిల్లలు. కూలి చేసుకుని బతుకుతున్నాం. ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నాను. మొదటి పేరు నాదే ఉంది. కానీ నాకు ఇల్లు రాలేదు. ఏమిటని అడిగితే లిస్టులో పేరు రాలేదంటున్నారు. ఇంత అన్యాయమా?
పరదాల కింద ఉంటున్నాను..
మా నాన్న వాళ్ల ఇంటి పరదాల కింద ఉంటున్నాను. నాకు ఇల్లు రాలేదు. ఉన్నోళ్లకే ఇచ్చారు. అప్పు డు ఇందిరమ్మ ఇళ్లు ఉన్నోళ్లకు ఇప్పుడు ఇళ్లు వచ్చాయి. డాబా లు ఉన్న వాళ్లకు కూడా ఇళ్లు ఇచ్చారు. మేము రాజకీయంగా తిరగడం లేదని మాకు లేకుండా చేశారు. పేదోళ్లపై సర్కారు చూపించే మమకారం ఇదేనా. ఇంత అక్కసు చూపెడుతున్నారు.
– కంటె వెంకటేశ్వర్లు, పెనుబల్లి, చుంచుపల్లి మండలం
ఆదివాసీలకు కూడా ఇల్లు ఇవ్వరా?
నేను ఆదివాసీని. నాకు కూడా ఇల్లు రాలేదు. ఇంత అన్యాయం ఉంటదా. నాకు ఇల్లు లేదు. పందిరి వేసి రేకులు వేసుకున్న. వాన, గాలి వస్తే మళ్లీ చెట్లకిందనే ఉండాలి. నాలాంటోడికి కూడా ఇల్లు ఇవ్వరా? అడవి బతుకులు బతుకుతున్నాం. మాకు ఎవరూ న్యాయం చేయడం లేదు.
– కోరెం వంశీ, పాతూరు, లక్ష్మీదేవిపల్లి మండలం
ఇద్దరిలో ఒకరికే ఇస్తామంటున్నారు..
ఆనాడు మా ఇంట్లో ఇద్దరం అన్నదమ్ములం ఇండ్లులేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు గుర్తించారు. మాకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయినట్లు కలెక్టర్ గారి పేరుతో పత్రాలు కూడా ఇచ్చా రు. ఇద్దరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. పిల్లలు కూడా ఉన్నారు. కానీ తీరా ఇప్పుడు మాత్రం మీ ఇద్దరిలో ఒక్కరికే ఇల్లు వస్తుందని, ఎవరికి కావాలో మేరే తేల్చుకోవాలని చెబుతున్నారు. అన్నదమ్ముల మధ్య ఇలా పంచాయితీ పెడితే ఎలా? ఇద్దరం పేదవాళ్లం. అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ఇస్తామని చెప్పి ఇలా తిప్పడం సరికాదు. పెద్ద అధికారులు జోక్యం చేసుకొని మా కుటుంబానికి న్యాయం చేయాలి.
– కిన్నెర నరేశ్, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు, ఆరెంపుల, ఖమ్మంరూరల్ మండలం
పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి..
మాకు ఖాళీ స్థలం ఉంది. ఉన్న ఇల్లు బాగాలేదు. ఇందిరమ్మ ఇల్లు వస్తే కట్టుకుందామనుకున్నా. మా ఊళ్లో 55 ఇండ్లు వస్తయన్నరు. చివరకి 13 మందినే ఎంపిక చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లకు అన్యాయం చేస్తున్నది. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం జరగట్లేదు. అర్హులందరికీ ఇండ్లు ఇవ్వాలి.
– చిప్పలపల్లి మధు, ఏలువారిగూడెం, తిరుమలాయపాలెం మండలం
ఇంటి కోసం ఎదురుచూస్తున్నాం..
మా గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారులు వేయికండ్లతో ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇల్లు నమూనా చూపించి ఇలా నిర్మాణం చేపట్టండి అంటున్నారు.. అయితే అధికారులే దగ్గరుండి ఇంటికి సంబంధించిన ప్లాన్ వేసి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలి.
– జయబాబు, లబ్ధిదారుడు, ఎర్రబోరు గ్రామం, పర్ణశాల