సర్కారు బళ్లలో చదువుకునే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు సకల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కారు పలు పథకాలను అమలు చేసింది. దానిలో భాగంగా ‘మన ఊరు/ మన బస్తీ మన బడి’ పథకాన్ని తెచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి హంగులతో సౌకర్యాలు కల్పించింది. దీంతో ఖమ్మం జిల్లాలో ఈ పథకానికి ఎంపికైన పాఠశాలలన్నీ నూతన శోభను సంతరించుకున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ పథకాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా గుర్తించి వెనువెంటనే నిధులు విడుదల చేస్తూ పనులు వేగంగా చేయించింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘మన బడి’ పథకం ద్వారా ప్రారంభించిన కొన్ని పనులపై శీతకన్ను వేసింది. ఆ పథకం కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు బిల్లులను చెల్లించలేదు. పైగా ఆ పథకం ద్వారా చేస్తున్న పనులను కూడా ఆపేసింది.
అయితే, పూర్తయిన పనులకు సంబంధించిన నిధులను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు విడుదల చేయకపోవడంతో ఆ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ‘బడి బకాయిలు చెల్లించండి మహాప్రభో’ అంటూ వేడుకుంటున్నారు. అప్పులు తెచ్చి మరీ పనులు చేపట్టామని, బిల్లులు విడుదల కాకపోవడంతో ఇప్పుడు వాటికి వడ్డీలు కూడా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ఖమ్మం, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం నగరంలోని ఇందిరానగర్ పాఠశాలలో ‘మన బడి’ ద్వారా నిర్మించిన అదనపు తరగతి గదులు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. కాంట్రాక్టర్ కూడా తక్కువ సమయంలో ఈ నిర్మాణాలను మెరుగ్గానే చేపట్టారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించి కాంట్రాక్టర్‌తో పనులను పూర్తిచేయించారు. ఇలా పూర్తి చేయించి సుమారు రెండేళ్లవుతున్నా కాంట్రాక్టర్‌కు మాత్రం బిల్లులు రాని పరిస్థితి. ఇలాంటి ఘటనలు ఖమ్మం జిల్లాలో ఇంకా ఎన్నో ఉన్నాయి.
రూ.9.76 కోట్ల బిల్లులు పెండింగ్
‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ పథకం కింద ఖమ్మం జిల్లాలో 425 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో చేయాల్సిన పనుల మొత్తానికి అయ్యే వ్యయాన్ని ఇంజినీరింగ్ అధికారులు రూ.33.46 కోట్లుగా అంచనా వేశారు. గత ప్రభుత్వంలో కలెక్టర్లు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండేవారు. బిల్లులను కూడా వారే విడుదల చేసిన పరిస్థితులున్నాయి.
అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, డైనింగ్ హాళ్లు వంటి నిర్మాణ పనులను జిల్లాస్థాయిలో కాంట్రాక్టర్లు పూర్తి చేశారు. వీటిల్లో రూ.23.76 కోట్ల బిల్లులను అప్పటి ప్రభుత్వం చెల్లించింది. ఆ తరువాత, అంతకుమునుపు జరిగిన పనులకు సంబంధించిన రూ.9.76 కోట్ల బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన కాంట్రాక్టర్లు ఇక పాఠశాలలకు తాళాలు వేస్తే తప్ప తమ బిల్లులు రావనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
సమకూరిన సదుపాయాలు..
సర్కారు బడుల దిశ దశ మార్చాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుదల చేసింది. దాని స్థానంలో ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు’ అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. కానీ, ‘మన బడి’ పథకం పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని 425 ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలతో ఆ పాఠశాలలన్నీ సరికొత్త సొబగులద్దుకున్నాయి. ఆధునిక హంగులను రూపుదిద్దుకున్నాయి. నీటి సరఫరా, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ, తాగునీరు, ఫర్నీచర్, పెయింటింగ్, మరమ్మతులు, ఆకుపచ్చ రాతబోర్డులు, ప్రహరీ, వంట గది, నూతన తరగతి గదులు, భోజనశాల, డిజిటల్ క్లాస్‌లు వంటి మౌలిక సదుపాయాలన్నీ సమకూరాయి.
పనులు పూర్తి కాకున్నా ‘ఏఏపీ’ బిల్లుల చెల్లింపు..
అయితే, ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చిన ‘మన బడి’ పథకాన్ని పక్కనబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తన పాలనలో ‘అమ్మ ఆదర్శ పాఠశాలలు(ఏఏపీ)’ అంటూ ఇంకో పథకాన్ని తెచ్చుకుంది. ఈ పథకం పేరిట పలు పాఠశాలల్లో అభివృద్ధి పనులను చేపడుతోంది. అయితే, ‘మన బడి’ పథకం కింద పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని రేవంత్ ప్రభుత్వం.. ఏఏపీ కింద చేపట్టిన పనులకు మాత్రం ఆగమేఘాల మీద బిల్లులు చెల్లిస్తోంది. కొన్నిచోట్ల పూర్తికాని పనులకు సైతం బిల్లులు క్లియర్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
‘ఏఏపీ’ నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలు..
ఏఏపీ కింద చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించినా కాంగ్రెస్ ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. కూసుమంచి మండలంలోని ఓ ఎంపీపీఎస్‌లో కాంట్రాక్టర్ చేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.47 లక్షల బిల్లులు చెల్లించింది. కానీ, ఆ పాఠశాలలో టాయిలెట్లు, వాటర్ ట్యాంక్ కూడా వినియోగంలోకి రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 955 స్కూళ్లను ఏఏపీ పథకంలో గుర్తించగా.. వాటిల్లో 922 స్కూళ్లలో పనులు పూర్తయినట్లు, 33 స్కూళ్లలో పనులు జరుగుతున్నట్లు అధికారులు లెక్కల్లో చూపిస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పైగా, వీటి నిర్మాణాలకు రూ.35.14 కోట్లుగా అంచనా వేయగా.. ఇప్పటికే రూ.23.21 కోట్ల బిల్లులు చెల్లించారు. ఈ తారతమ్యాలకు కాంగ్రెస్ సర్కారే సమాధానం చెప్పాలంటూ.. ‘మన బడి’ పనులు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.