దుమ్ముగూడెం/పర్ణశాల, ఫిబ్రవరి 6 : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈసడించుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. తూరుబాక, డబ్ల్యూఎల్ రేగుబల్లి, పర్ణశాల, బీ కొత్తగూడెం, సింగవరం, దంతెనం, బండిరేవు పంచాయతీలలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కణితి రాముడు అధ్యక్షతన గురువారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేగా మాట్లాడారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు అలవికాని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదన్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కోత విధించడమే పనిగా పెట్టుకున్నదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటుందని అన్నారు. గత కేసీఆర్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ప్రతీ కుటుంబానికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని కోరారు. కష్టపడి పనిచేసే ప్రతీ ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, వారికి పదవులు కూడా దక్కుతాయన్నారు.
బీఆర్ఎస్ పోటీ చేసే అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని రేగా కోరారు. సమావేశాల్లో భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానె రామకృష్ణ, వాసురాజు, బీఆర్ఎస్ కో కన్వీనర్ ఎండీ జానీపాషా, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి, ఒల్లి వెంకట్రావ్, కాల్వ పూర్ణయ్య, కాటెబోయిన వెంకటేశ్వర్లు, సోడె కొండయ్య, భూక్యా చందు, దొడ్డి తాతారావు, ఆకోజు సునీల్, తునికి కామేశ్, జోగా బుజ్జి, దామెర్ల శ్రీనివాసరావు, వాగే వెంకటేశ్వరరావు, జుంజురి జయసింహ, మడకం భూపతి, పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ కొత్త మల్లేశ్, గంట్ల సురేశ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.