నల్లగొండ ప్రతినిధి, జూన్ 7 (నమస్తే తెలంగాణ) : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. మూడ్రోజులపాటు ఉతంఠగా సాగిన ఓట్ల లెకింపులో ఎలిమినేషన్ రౌండ్స్‌తో ఆయన విజయం ఖరారైంది. ఆది నుంచి హోరాహోరీగా సాగిన పోరులో ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో రెండో స్థానంలో ఉన్న రాకేశ్‌రెడ్డి ఎలిమినేషన్‌తో మల్లన్నను విజయం వరించింది. పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోరు మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తికరంగా సాగింది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఉతంఠతను రేకెత్తించింది. ప్రధాన అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్‌రెడ్డితోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 52 మంది ఉప ఎన్నిక బరిలో నిలిచారు. గత నెల 27న పోలింగ్ జరిగింది.
పట్టభద్రుల నియోజకవర్గంలో మొత్తం 4.63 లక్షల ఓట్లు ఉండగా, 3,36,013 ఓట్లు పోలయ్యాయి. నల్లగొండ శివారులోని దుప్పలపల్లి వేర్ హౌసింగ్ గోదాముల్లో మూడ్రోజుల పాటు కౌంటింగ్ సాగింది. బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టగా గురువారం రాత్రి 10 గంటలకు పూర్తయ్యింది. దాంతో అప్పుడు చెల్లని 27,978 ఓట్లను పక్కన వేసి చెల్లిన ఓట్ల నుంచి గెలుపు కోటాను నిర్ధారించారు. మొత్తం 1,55,095 ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపొందుతారని ప్రకటించారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి ఎలిమినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి మొదటగా ఎలిమినేషన్ చేశారు. ఆయనకు వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను పైనుంచి మిగిలిన అభ్యర్థులకు పంచుతూ వచ్చారు.
ఇలా మొత్తం స్వతంత్ర అభ్యర్థులుగా ఉండి అత్యధిక ఓట్లు సాధించిన అశోక్‌కుమార్ వరకు సాగింది. ఇక్కడ కూడా గెలుపు కోటాకు అవసరమైన ఓట్లు ఎవరికీ రాలేదు. తొలి ప్రాధాన్యత ఓట్లల్లో 18,865 ఓట్ల ఆధిక్యం సాధించిన తీన్మార్ మల్లన్న ఎలిమినేషన్ రౌండ్స్‌లోనూ ఆధిక్యతను కొనసాగించారు. ఆర్వో హాల్లో చివరి నుంచి పైకి 48 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియను చేపడుతూ వచ్చారు. కౌంటింగ్ మరింత ఆలస్యం అవుతున్న కారణంగా శుక్రవారం ఆర్ఓ హరిచందన అభ్యర్థులతో చర్చించి ఏకకాలంలో తొలి ప్రాధాన్యతలో ఎక్కువ ఓట్లు ఉన్న స్వతంత్ర అశోక్‌కుమార్, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ రౌండ్స్‌ను నాలుగు కౌంటింగ్ హాల్స్‌లో సమాంతరంగా మొదలుపెట్టారు. 49వ అభ్యర్థిగా ఎలిమినేషన్‌కు గురైన అశోక్‌కుమార్ నుంచి అనధికార లెక్కల ప్రకారం.
తీన్మార్ మల్లన్నకు సుమారు 9 వేల ఓట్లు రాగా, రాకేశ్‌రెడ్డికి 8,700 ఓట్ల వరకు వచ్చాయి. తర్వాత ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ రౌండ్‌ను చేపట్టారు. ఇందులో రాకేశ్‌రెడ్డి ఆధిపత్యం ప్రదర్శించారు. అనధికార లెక్కల ప్రకారం రాకేశ్‌రెడ్డికి 18 వేల పైచిలుకు ఓట్లు రాగా, మల్లన్నకు 13 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. వాటితోపాటు దిగువన ఎలిమినేట్ అయిన అభ్యర్థుల నుంచి సబ్ పార్సిల్స్‌లో వచ్చిన ఓట్లను సైతం మల్లన్నకు, రాకేశ్‌రెడ్డికి షేర్ చేశారు. ఈ క్రమంలో మల్లన్న గెలుపు కోటా సుమారు ఐదు వేల ఓట్ల దూరంగా నిలిచిపోగా.. రాకేశ్‌రెడ్డి 20 వేల దూరంలో ఉన్నారు. దాంతో రాకేశ్‌రెడ్డిని కూడా ఎలిమినేట్ చేయడంతో మల్లన్న విజయం ఖాయమైంది. తీన్మార్ మల్లన్న విజయం ఖాయం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పటాకులు కాలుస్తూ సంబురాలు చేశారు. ఇది సమష్టి విజయమని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.
పట్టభద్రుల ఎన్నికల్లోనూ ప్రతీసారి చెల్లని ఓట్లు భారీగా ఉంటుండడం చర్చనీయాంశంగా మారింది. అభ్యర్థుల ప్రచారంలో, సోషల్ మీడియాలో, అధికారికంగానూ ఎంత అవగాహన కల్పిస్తున్నా పట్టభద్రులు ఓటు వేయడంలో తడబాటుకు గురవుతూనే ఉన్నారు. ఈ సారి కూడా 27,978 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తం ఓట్లలో ఇవి 8.32 శాతంగా ఉన్నాయి. ఇక 2021 మార్చి ఎన్నికల్లో 5.57 శాతంతో 21,636 ఓట్లు చెల్లకుండా పోయాయి. 2015 మార్చిలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 9.14 శాతం ఓట్లతో 14,039 ఓట్లు చెల్లలేదు. పోస్టల్ బ్యాలెట్లలోనూ సరైన నిబంధనలు పాటించని కారణంగా పలువురి ఓట్లు చెల్లలేదని తెలిసింది.
కౌంటింగ్ ప్రక్రియ సుధీర్ఘంగా సాగింది. ఎలిమినేషన్ రౌండ్స్ కూడా 26 గంటలకు పైగా కొనసాగాయి. గురువారం రాత్రి 9 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ముందుగా దీనిపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత గెలుపు కోటా సాధన కోసం ఎలిమినేషన్ రౌండ్స్‌ను ప్రారంభించారు. ఆర్ఓ హరిచందన పర్యవేక్షణలో ఎలిమినేషన్ రౌండ్స్‌లో బరిలో ఉన్న మొత్తం 52 మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిని తొలగించుకుంటూ వారికి వచ్చిన ద్వితీయ తర్వాత ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు పంచుతూ కొనసాగించారు. శుక్రవారం ఉదయం 12 గంటల వరకు 33 మందే ఎలిమినేట్ కావడంతో సుధీర్ఘ సమయం పడుతుందని ఆలోచించారు.
దాంతో ఆర్ఓ హాల్లో అశోక్‌కుమార్‌కు దిగువన ఉన్న స్వతంత్ర అభ్యర్థుల ఎలిమినేషన్ రౌండ్స్‌ను కొనసాగిస్తూనే సమాంతరంగా అశోక్‌కుమార్ ఎలిమినేషన్ నాలుగు కౌంటింగ్ హాల్స్‌లో చేపట్టారు. ఆ తర్వాత వెంటనే ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ రౌండ్ చేశారు. వీరిద్దరితోపాటు అంతకుముందున్న వారి ఎలిమినేషన్ పూర్తయ్యే సరికి రాత్రి 10 గంటలు దాటింది. వీరి ఎలిమినేషన్ అనంతరం అధికారికంగా లెక్కలు తేలేసరికి మరింత సమయం తీసుకుంది. అర్ధరాత్రి రాకేశ్‌రెడ్డి ఎలిమినేషన్‌తో మల్లన్న విజయం ఖరారైంది. దాదాపు 64 గంటలకు పైగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఈ కౌంటింగ్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు ఇలా ప్రతి ఒక్కరూ పూర్తి అలసటగా కనిపించారు.