కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలతో కర్షకుల్లో కలవరం మొదలైంది. రైతు సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవేమోననే భయం వెంటాడుతోంది. రూ.2 లక్షల రుణమాఫీ అంటూ మొన్నటి వరకూ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు.. అందులో సింహభాగం మందికి పైగా ఎగనామం పెట్టిన విషయాన్ని అన్నదాతలు గుర్తుచేసుకుంటున్నారు. దీంతో తాజాగా మొదలైన రైతుభరోసా సర్వేపై కూడా ఇదేవిధమైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాగుకు యోగ్యమైన భూములకే రైతుభరోసా అని చెబుతున్నప్పటికీ దానిని ‘అందరికీ ఇస్తారా? లేక కొందరికే పరిమితం చేస్తారా?’ అనే అనుమానాలను ముందుకు తెస్తున్నారు. ఎందుకంటే రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామంటూ ఇన్నాళ్లూ నమ్మబలికిన ప్రభుత్వం.. ఆ మొత్తాన్ని కూడా రూ.12 వేలకు కుదించడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇక ఈ రూ.12 వేలను కూడా పంటలు సాగు చేస్తున్న రైతులకేనంటూ మెలికలు పెట్టడం కూడా మోసంలో భాగమేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో 5.56 లక్షల ఎకరాల్లో పంటలు సాగువు తుండగా అన్ని ఎకరాలకూ గత కేసీఆర్ ప్రభుత్వం రూ.10 వేల చొప్పున రైతుబంధును వర్తింపజేసిన విషయాన్ని వివరిస్తున్నారు. మరి ‘గడిచిన రెండు సీజన్ల పంటల పెట్టుబడి సాయాన్ని ఎగవేసినట్లేనా?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
– భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/చుంచుపల్లి, జనవరి 19
రైతు సంక్షేమ పథకాల అమలులో రేవంత్ ప్రభుత్వం మరోసారి మాట తప్పింది. రుణమాఫీకి తూట్లు పొడిచినట్లుగానే రైతుభరోసాలోనూ కోతలు పెడుతోంది. రూ.15 వేల సాయాన్ని రూ.12 వేలకు తగ్గించినప్పటికీ అందులో అనేక కొర్రీలు పెట్టి కర్షకుల సంఖ్యను మరింత కుదించేందుకు కుటిల యత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండు సీజన్ల పంటల పెట్టుబడి సాయం విడుదల గురించి స్పష్టత ఇవ్వకుండానే తాజాగా రైతుభరోసా సర్వేకు చేపట్టింది. ఈ నెల 26 నుంచి రైతుభరోసా ఇస్తామని చెబుతోంది. దానికి సమాంతరంగా సర్వేలు కొనసాగిస్తుండడం, సాగు యోగ్యమైన భూములకేనంటూ స్పష్టం చేస్తుండడం వంటి కారణాలతో ఈ పంటల సాయం కూడా ‘అందరికా? లేక కొందరికా?’ అనే సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉండగానే క్షేత్రస్థాయిలో సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామస్థాయి నుంచి ఆర్ఐలు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శులు కలిసి గ్రామస్థాయిలో సాగుకు యోగ్యమైన భూములను గుర్తిస్తున్నారు. ఈ సర్వేలకు సూపర్ చెక్‌గా మండల స్థాయిలో మండల ఉన్నత అధికారులు తనిఖీలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 354 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఆయా బృందాల సభ్యులు క్లస్టర్ల వారీగా భూములను సర్వే చేస్తున్నారు. ధరణి పట్టాదారు పాస్‌బుక్‌లు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతుల భూములను పరిశీలిస్తున్నారు.
అన్నదాతల్లో అయోమయం
ప్రభుత్వ ప్రకటనలు, మంత్రుల మాటలు భిన్నంగా ఉంటుండడంతో అన్నదాతల్లో అయోమయం నెలకొంది. ఇటీవల మంత్రులు కూడా భిన్న ప్రకటనలు చేస్తుండడం ఇందుకు కారణమవుతోంది. అర్హులైన రైతులెవరికీ అన్యాయం జరగదంటూ ఓ మంత్రి చెబుతుండగా.. కేవలం సాగుకు యోగ్యమైన భూములకేనంటూ మరో మంత్రి చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గత కేసీఆర్ సర్కారు రైతులందరికీ ధరణి పాసుపుస్తకాలను జారీ చేసింది. పోడు రైతులు, సాధారణ రైతులు కలిపి మొత్తంగా 5.56 లక్షల ఎకరాల భూమిని సాగు చేస్తున్నారు. రాష్ట్రంలోకెల్లా భద్రాద్రి జిల్లాలోనే అత్యధిక మంది రైతులకు గత కేసీఆర్ సర్కారు పోడు పట్టాలను మంజూరు చేసింది. వీరిలో అందరికీ క్రమం తప్పకుండా రైతుబంధును అందించింది. రైతుబీమాను వర్తింపజేసింది. ఎక్కడా ఏ కోతలూ పెట్టలేదు. కానీ కాంగ్రెస్ సర్కారు కోతలు పెడుతుండడంతో కర్షకుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
21, 22, 23 తేదీల్లో తేలనున్న అర్హులు
భద్రాద్రి జిల్లాలో 354 రెవెన్యూ గ్రామాలకు గాను 194 గ్రామాల్లో రైతుభరోసా సర్వే పూర్తయినట్లు సమాచారం. ‘రైతుభరోసా ఇవ్వడానికి ఎలాంటి పొలం అర్హత పొందుతుంది?’ అనే అంశంపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. మండలస్థాయిలో సూపర్ చెకింగ్ చేసినా చివరికి గ్రామసభల ద్వారానే అర్హులైన రైతులను ఎంపిక చేయనున్నారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో పంచాయతీ స్థాయిలో గ్రామసభలను నిర్వహించి అర్హులను గుర్తించనున్నారు.
రెండు సీజన్ల రైతుభరోసానూ ఇవ్వాలి..
గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు ఎప్పుడూ ఆగలేదు. ప్రతి సీజన్లోనూ పంట కాలానికి ముందుగానే మా రైతుల బ్యాంకు ఖాతాల్లో పంటల పెట్టుబడి సాయం జమ అయ్యేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గడిచిన సీజన్లకు రైతుభరోసా ఇవ్వలేదు. తాజా రైతుభరోసాకూ పాత రెండు సీజన్ల పంటల పెట్టుబడిని కలిపి ఇవ్వాలి.
-పెద్దిని వేణు. రైతు సంఘం నాయకుడు, చండ్రుగొండ
అయోమయంగా ఉంది..
రైతుభరోసా విషయంలో అంతా అయోమంగా ఉంది. మాకు ఆరు ఎకరాల సాగు భూమి ఉంది. గత ప్రభుత్వంలో రైతుబంధు క్రమం తప్పకుండా వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుభరోసా రావడం లేదు. అసలు వస్తుందో రాదో తెలియడం లేదు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తారో? లేక ఇకనైనా ఇస్తారో? అనే స్పష్టత కోసం చూస్తున్నాం.
-భూక్యా లక్ష్మి, రైతు, సుజాతనగర్
కౌలు రైతుల పరిస్థితేంటి?
కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మాట తప్పింది. తాజా రైతుభరోసాలో కౌలు రైతుల ఉసే ఎత్తడంలేదు. సర్వేల్లో కూడా మా గురించి చెప్పడం లేదు. సాగు యోగ్యమైన భూముల వివరాలను అధికారులు నమోదుచేసుకొని వెళ్తున్నారు. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకొని మాలాంటి రైతులకు కూడా పంటల సాయం అందించాలి.
-షేక్ అహ్మద్, పెనగడప, కౌలు రైతు
పంటలు వేసే భూములకు భరోసా..
పంటలు సాగు చేసే భూములకు రైతుభరోసా వర్తిస్తుంది. అర్హమైన భూముల గుర్తింపు కోసం చేపట్టిన సర్వేలు పూర్తి కావస్తున్నాయి. ఒక్కో మండలంలో మూడు బృందాలు సర్వేలు చేస్తున్నాయి. గ్రామసభలు అయ్యాక ఈ నెల 26న రైతుభరోసా పంటల సాయం నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
-బాబూరావు, డీఏవో, భద్రాద్రి