ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. సాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన రైతులు సొసైటీల వద్దకు మంగళవారం తెల్లవారుజామునే పరుగులు పెడుతూ పొద్దంతా పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి జిల్లా సాగు అవసరాలకు యూరియా పంపిణీ చేయాల్సిన ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.
పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు అదును మీద యూరియా వేయకపోతే దిగుబడి తగ్గుతుందని ఆందోళన చెందుతున్న రైతులు ఒక్క బస్తా కోసం యాతన పడుతున్నారు. సొసైటీల వద్దకు వేలాది మంది రైతులు వస్తే.. ‘లోడు రాలేదని, సరిపోయేంత యూరియా లేదని, ఈరోజు టోకెన్లు ఇచ్చి రేపు యూరియా పంపిణీ చేస్తామని’ సొసైటీ సిబ్బంది చెబుతుండడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేయాల్సిన దుస్థితి నెలకొంది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ, వీవీ పాలెం, బోనకల్లు మండలం రావినూతల, బ్రాహ్మణపల్లి సొసైటీలు, కొణిజర్ల మండలం గోపవరం సొసైటీ, ముదిగొండ మండలం మేడేపల్లి సొసైటీ, వేంసూరు మండలం కేజీ మల్లెల సొసైటీ, తల్లాడ సొసైటీ, గంగదేవిపాడు సొసైటీ, భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం పీఏసీఎస్, చర్ల మండలం సత్యనారాయణపురం సొసైటీ, ఇల్లెందు సొసైటీ, నిజాంపేట సొసైటీ, పాల్వంచ సొసైటీ కార్యాలయాల వద్ద రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. నిజాంపేట సొసైటీ వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ రైతులకు సరిపోయే యూరియా అందించాలని అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కొన్నిచోట్ల పోలీసు పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు. వ్యవసాయ మంత్రి తుమ్మల ఇలాకాలో కూడా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
-నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 2
బీఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో..
పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రూరల్ మండలం నాయుడుపేట బైపాస్ రింగ్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పాల్వంచ సొసైటీ కార్యాలయం వద్ద రైతులందరికీ యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.