మణుగూరు టౌన్, అక్టోబర్ 5: పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై బలవంతంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
తమ పార్టీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం జిల్లా ఎస్పీ రోహిత్రాజును అయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని, వారికి తనతోపాటు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టలేదని, వేధింపులకు గురిచేయలేదని అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు పోశం నర్సింహారావు, ముత్యం బాబు, కుర్రి నాగేశ్వరరావు, భాస్కరరావు, వట్టం రాంబాబు, ముద్దంగుల కృష్ణ, కుంటా లక్ష్మణ్, ఆవుల నర్సింహారావు, ఎడ్ల శ్రీనివాస్, దర్శనాల శ్రీనివాస్, నూకారపు రమేష్ పాల్గొన్నారు.