కొత్తగూడెం సింగరేణి, మే 20: రానున్న మూడేళ్లలో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో యువ సింగరేణి అధికారులు సంస్థ అభివృద్ధికి బాసటగా నిలవాలని, వ్యాపార విస్తరణపై అవగాహన పెంచుకోవాలని సంస్థ సీఎండీ బలరాం సూచించారు. సంస్థ చరిత్రలో తొలిసారిగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి అధికారులైన మేనేజర్, డిప్యూటీ మేనేజర్లతో ఆయన మంగళవారం సాయంత్రం హెడ్డాఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
అన్ని ఏరియాల నుంచి వివిధ విభాగాలకు చెందిన సుమారు 762 మందితో సమీక్ష నిర్వహించారు. సింగరేణి బొగ్గు ధర ప్రస్తుతానికి దేశంలోని ఇతర బొగ్గు కంపెనీల కన్నా చాలా ఎక్కువగా ఉన్నదని, అందుకే వినియోగదారులు తక్కువ ధరకు బొగ్గు లభించే మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారని, ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. మన సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని, ఉత్పత్తి వ్యయం తగ్గించాలని, ఇందుకు యువ అధికారులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పాత గనులు కొన్ని మూతబడుతున్న నేపథ్యంలో ఒడిశాలోని నైనీ బ్లాక్, కొత్తగూడెంలోని వీకేవోసీ, ఇల్లెందులోని జీకేవోసీ, బెల్లంపల్లిలోని గోలేటి ఓసీల నుంచి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో 20 మిలియన్ టన్నుల బొగ్గు అదనంగా వస్తుందని చెప్పారు. వీసీలో డైరెక్టర్లు సత్యనారాయణ, ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, జీఎంలు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.