ఖమ్మం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డికి, పలువురు మంత్రులకు చేదు అనుభవం ఎదురైంది. మండలంలోని పోలేపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీలో సీఎం పర్యటిస్తున్న సమయంలో స్థానికులు అడుగడుగునా అడ్డుతగిలారు. సోమవారం సాయంత్రం కాలనీలో సీఎం పర్యటన ఉంటుందని సరిగ్గా రెండుగంటల ముందుగా అధికారికంగా షెడ్యూల్ విడుదలైంది. సాయంత్రం 4:30 గంటలకు రావాల్సిన సీఎం, మంత్రులు.. 5:30 గంటలకు కరుణగిరి ఏరియాకు వచ్చారు.
అయితే ఉదయం 8 గంటల సమయంలో అదే ప్రాంతంలో సుమారు రెండు గంటలపాటు కాలనీవాసులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం పట్టించుకోవాలని, మంత్రి పొంగులేటి తమ కాలనీని పరిశీలించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేసిన నేపథ్యంలో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలినడక కాకుండా ఓపెన్‌టాప్ జీప్‌ను ఏర్పాటు చేశారు. సరిగ్గా సీఎం వచ్చే గంట ముందుగా అధికారులు వచ్చి జేసీబీలను తీసుకొచ్చి పారిశుధ్య పనులు చేపట్టారు. కాలనీవాసులకు తాగునీరు, ఆహార పొట్లాలు తీసుకొచ్చారు. అయితే, కాలినడకన ఇంటింటి పర్యటనకు సీఎం వస్తారని ఆశించిన కాలనీవాసులకు.. ఓపెన్‌టాప్ జీప్‌పై సీఎం కన్పించి అభివాదం చేశారు. దీంతో ఆగ్రహించిన కాలనీవాసులు.. నిరసన తెలిపారు.
జీప్ దిగివచ్చి తమ ఇబ్బందులను చూడాలంటూ నినాదాలు చేశారు. కాగా, కాలనీలో దాదాపు 15 నిమిషాలపాటు జీప్‌పై ఉన్న సీఎం.. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడాన్ని గమనిచారు. అలాగే, కాలనీ సెంటర్‌కు వచ్చిన ఆయన.. అక్కడ జీప్ ఆపారు. పక్కనే ఉన్న మూతి సంతోశ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. అలా వెళ్లి ఇంటి పరిసరాలను చూసి ఇలా తిరిగి వచ్చి జీప్ ఎక్కబోయారు. ఆ సమయంలో ఓ వ్యక్తి సీఎం జీప్ అడ్డంగా వచ్చి కింద పడుకునే ప్రయత్నం చేశారు. ఈలోపే సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అనంతరం అదే సెంటర్లో కాలనీవాసులను ఉద్దేశించి తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతారని మంత్రి చెప్పినప్పటికీ.. స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో నేరుగా ముఖ్యమంత్రే మైక్ తీసుకొని మాట్లాడారు. సీఎం ప్రసంగం ఆరంభం మొదలుకాగానే.. దూరంగా ఉన్న కాలనీవాసులు నినాదాలు చేశారు. ‘ప్రచారం వద్దు.. సాయం చేయండి..’ అంటూ నినదించారు. ‘ఇంటికి రూ.పది వేల పరిహారం ఇస్తాం..’ అని చెప్పే సమయంలో అన్ని వైపుల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘మీరు ఇచ్చే రూ.పది వేలకు ఒక్క సామాను కూడా రాదు.. మీ రూ.పది వేలు వద్దు.. మీరు వద్దు..’ అంటూ చేతులు ఎత్తి నినాదాలు చేశారు. కాగా, సీఎం కాన్వాయి వెళ్లిన తరువాత కూడా కాలనీవాసులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కాలనీకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. దీంతో వారు కూడా నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.