మామిళ్లగూడెం, జనవరి 8: ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. దరఖాస్తుల నమోదు ప్రక్రియ నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తుల డాటా నమోదుపై నూతన కలెక్టరేట్లో ప్రత్యేక అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన గ్రామసభల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి 3,78,788 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుంచి 1,09,764 దరఖాస్తులు కలిపి మొత్తంగా 4,88,316 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. జిల్లాలో 40 ప్రాంతాల్లో 1,310 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించి జనవరి 5 నుంచి డాటా ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ నెల 12లోగా ప్రక్రియ పూర్తయ్యేలా కార్యాచరణ చేసినట్లు తెలిపారు. సోమవారం వరకు సుమారు 2 లక్షల దరఖాస్తుల డాటా ఎంట్రీ పూర్తయినట్లు చెప్పారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో అప్పారావు, ఆర్డీవోలు జీ.గణేశ్, అశోక్ చక్రవర్తి, ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో గత 2022-23 వానకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్ రైస్ డెలివరీ, ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. 2022-23 వానకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్ రైస్ డెలివరీ, ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదుపై రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం నుంచి కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ప్రతిరోజూ నిర్దేశిత లక్ష్యం మేరకు సీసీఐకి సీఎంఆర్ రైస్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాపాలన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా ఆన్లైన్లో నమోదు చేస్తామని తెలిపారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డీ.మధుసూదన్‌నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, డీపీవో హరికిషన్, డీసీవో విజయకుమారి, డీసీఎస్వో శ్రీలత, ఏడీఏ సరిత తదితరులు పాల్గొన్నారు.