కూసుమంచి, జూన్ 8 : రైతులు తక్కువ కాలపరిమితి గల పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ దివాకర అన్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఈశ్వరమాధారం గ్రామంలో సోమవారం జరిగిన ప్రజా పాలన – ప్రగతి నివేదిక గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ప్రస్తుత వానకాలంలో గ్రామాల్లో పారిశుధ్యం నిర్వహణ చాలా ముఖ్యమని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంచాయతీ సిబ్బంది తాగునీరు కలుషితం కాకుండా చూడాలని, పైపులైన్ల లీకేజీలు, మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 25 నుంచి బీఎల్వోలు ఇంటింటికీ ఓటర్ ఫాంలు ఇస్తారని, వాటిలో పూర్తి వివరాలు రాసి 11 గుర్తింపు పత్రాల్లో ఏదో ఒక దానిని జత చేయాలన్నారు. ఓటర్ల జాబితా పూర్తయిన తర్వాత గ్రామపంచాయతీల్లో నోటీసు బోర్డుపై పెడతామని, వాటిల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, మండల స్పెషల్ ఆఫీసర్ సునీల్‌రెడ్డి, సర్పంచ్ కొలిశెట్టి శ్రీను, ఎంపీడీవో జశ్వంత్‌కుమార్, తహసీల్దార్ సైదులు, ఏవో వాణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.