మామిళ్లగూడెం, జూలై 24: ఎల్‌నినో దృష్ట్యా ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ కార్యాచరణ చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల అవగాహనపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల వారీగా తాగునీటి సరఫరాపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు.
గ్రామాలు మిషన్‌భగీరథ నీటిపై ఆధారపడేవి, స్థానిక వనరుల లభ్యతపై స్పష్టంగా స్టడీ చేయాలని, ఏయే వనరులని వాడుకోవచ్చు, ఏయే వనరులను రీ జనరేట్ చేసుకోవచ్చో చూడాలన్నారు. గ్రామాలను క్షేత్రస్థాయిలో సందర్శించి నీటి వనరుల గుర్తింపు చేయాలన్నారు. గ్రామ సర్పంచులు, వార్డుసభ్యులు, ప్రజాప్రతినిధులతో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎల్‌నినో పరిస్థితులు వివరించి తాగునీటి, సాగునీటి, విద్యుత్ పొదుపుగా వాడటంపై చైతన్యం కల్పించాలన్నారు. వర్షాలు తక్కువగా ఉన్నందున నీటి పొదుపుపై అవగాహన కల్పించి తాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
నీటి వనరులలో నీరు వృథా, మళ్లింపు జరగకుండా పటిష్ట నిఘా ఉంచాలన్నారు. తాగునీటిపై ప్రతిఒక్కరికి అవగాహన ఉండాలని వచ్చే జూన్, జూలై వరకు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. సమావేశంలో ఎస్ఈ ఇరిగేషన్ ఎం.వెంకటేశ్వర్లు, ఎస్ఈ మిషన్ భగీరథ శేఖర్‌రెడ్డి, విద్యుత్‌శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి, డీపీవో రాంబాబు, వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.