వైరా టౌన్(ఏన్కూరు), ఫిబ్రవరి 27 : వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు సమయం వృథా చేయకుండా పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు. కలెక్టర్ ఏన్కూరులోని తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను గురువారం తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలో డార్మెటరీ, హాల్, కిచెన్, భోజనశాల, ప్రహరీ, తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలా సన్నద్ధమవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థుల తరగతి గదిలోకి వెళ్లి పరీక్షల సన్నద్ధతపై చైతన్యపరిచారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగేలా లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. రాబోయే నెల రోజులపాటు విద్యార్థులు సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలని, పూర్తి సమయం చదవడానికే కేటాయించాలని సూచించారు.కనీసం గంటపాటు క్రీడలకు సమయం కేటాయించాలని, దీనివల్ల ఒత్తిడి తగ్గుతుందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, స్నాక్స్ రుచికరంగా ఉంటున్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలియతిరిగి కావాల్సిన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. టాయిలెట్ బాక్స్, 2 హాళ్లు, గ్యాప్ ఉన్నచోట్ల ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, ఏన్కూరు తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో రమేశ్, అధికారులు పాల్గొన్నారు.