ముదిగొండ, ఏప్రిల్ 22: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందిపెట్టొద్దని, కొర్రీలతో మిల్లర్లు కొనుగోలు చేయని పక్షంలో వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మేడేపల్లిలో సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
తేమ శాతం వచ్చినా కాటాలు వేసి లోడ్ చేయడం లేదని చెప్పారు. దీనికి అధికారులు స్పందిస్తూ సత్యసాయి రైస్ మిల్లర్ ధాన్యం తీసుకోవడం లేదని కలెక్టర్‌కు వివరించారు. 1638 కూనవరం సాంబ రకం వడ్లు తీసుకోమని చెబుతున్నారని, దీనిపై సివిల్ సైప్లె అధికారులతో మాట్లాడగా.. సమస్య మా దృష్టికి వచ్చిందని, మిల్లర్‌తో మాట్లాడుతున్నామని చెప్పారు. రైతులు ఇబ్బంది పడుతుంటే మిల్లర్‌తో చర్చలు ఏమిటి? రేపటిలోగా తీసుకోకుంటే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఐకేపీ కేంద్రంలో 5 కేజీల తరుగు తీస్తేనే ధాన్యం తీసుకుంటామని అంటున్నారని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని పలుమార్లు సమావేశాలు నిర్వహించినా నిర్వహణ సరిగా లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. మీటింగ్‌లు తమాషా కోసం కాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులెవరూ అధైర్యపడొద్దని, కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత ఎలిజబెత్, ఏవో వేణు, ఆర్ఐ వహీద తదితరులు పాల్గొన్నారు.