మామిళ్లగూడెం, నవంబర్ 4:ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ప్రత్యేక ప్రాధాన్యంతో వెంటనే పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా ఖమ్మం ఐడీవోసీలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి సోమవారం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్.. వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు.
పరిష్కారం కోసం వాటిని ఆయా శాఖల ఉన్నతాధికారులకు రిఫర్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అర్జీదారులు తమ తమ సమస్యలపై వినతులు అందించారు. తాను మానసిక వికలాంగురాలినని, తల్లిదండ్రులు చనిపోయారని నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి గ్రామానికి చెందిన కొమ్మరాజు ప్రేమలత కలెక్టర్ వద్ద తన గోడు వెళ్లబోసుకున్నారు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. తాను బీటెక్ పూర్తి చేశానని, సత్తుపల్లి మైనార్టీ గురుకుల కళాశాలలో డీటీపీ ఆపరేటర్‌గా అవకాశం కల్పించాలని మాటూరిపేట గ్రామానికి చెందిన పానెం స్పందన వినతిపత్రం అందించారు.
జాతీయ రహదారి విస్తరణలో తన ఇల్లు పోయిందని, అధికారులు సగం నష్ట పరిహారం మాత్రమే చెల్లించారని నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామానికిన చెందిన సత్యనారాయణ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మిగతా సగం పరిహారాన్ని కూడా మంజూరు చేయాలని కోరారు. అలాగే, వివిధ మండలాల నుంచి ఇంకా పలువురు అర్జీదారులు తమ తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. డీఆర్వో రాజేశ్వరి, డీఆర్డీవో సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.