ఖమ్మం సిటీ, మార్చి 22 : వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే దివ్యాంగుల కోసం సదరం క్యాంప్ నిర్వహణ సమయంలో అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సదరం క్యాంప్‌ల నిర్వహణ కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేపట్టాల్సిన ఏర్పాట్లను శనివారం అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, శిక్షణా కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగులకు అందించే యూడీఐడీ కార్డులు తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల్లో కూడా ఉపయోగపడతాయని అన్నారు. కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఆసుపత్రిలో నిర్ధారణ కోసం సదరం స్లాట్ బుకింగ్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. వికలాంగత్వం నిర్ధారణ కోసం వైద్యులు, పరికరాలు ఉండేలా చూడాలని, క్యాంపు సమయంలో రిసెప్షన్ సెంటర్, కుర్చీలు, నీడ, తాగునీరు, టాయ్‌లెట్స్, ర్యాంప్ వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు.
పరీక్షల తర్వాత ప్రతీ దివ్యాంగుడి వైకల్యం శాతంతోపాటు ఇతర వివరాలను సంపూర్ణంగా యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా సంక్షేమాధికారి కే.రాంగోపాల్‌రెడ్డి, జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్, ఆర్ఎంవో డాక్టర్ రాంబాబు, వైద్య శాఖ ఈఈ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.