ఖమ్మం వ్యవసాయం, జూన్ 21 : విత్తనాలు, ఎరువుల కొనుగోలు బిల్లులను రైతులు పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునేలా దుకాణాదారులు వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బర్మాషెల్ రోడ్డు, గాంధీచౌక్‌లోని లక్ష్మీ వెంకటరమణ సీడ్స్, ఉషశ్రీ మార్కెటింగ్ ఏజెన్సీ, లక్ష్మీ మణికంఠ ఏజెన్సీ విత్తన, ఎరువుల షాపులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విత్తనాల ఖాళీ ప్యాకెట్లను కూడా సీజన్ పూర్తయ్యే వరకు రైతులు భద్రపర్చుకోవాలని సూచించారు.
షాపుల్లో ఉన్న విత్తనాలు, స్టాక్బోర్డులో ఉన్న వివరాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్‌బుక్స్, విత్తన బస్తాలపై లాట్ నెంబర్లు, ఎంఆర్పీ, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. షాపు అనుమతి పత్రాలను పరిశీలించి దుకాణాదారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇతర షాపులకు అమ్మినవి, రైతులకు నేరుగా అమ్మినవి వేర్వేరుగా రిజిస్టర్లు నిర్వహించాలన్నారు. రైతులు ఏఏ ప్రాంతాల నుంచి వస్తున్నారు.. ఏఏ రకాలు అడుగుతున్నారు.. జిల్లాలో ఏఏ కూరగాయలు పండిస్తారో తెలుసుకోవాలని, పూలసాగు, మార్కెటింగ్ పొజీషియన్ సందర్శనలు చేపట్టాలని, సాగులో సక్సెస్ అయిన రైతుల అనుభవాలను తెలుసుకొని ఇతర రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలు విక్రయించే వారి సమాచారాన్ని రైతులే అధికారులకు తెలియజేయాలని కోరారు. విత్తనాల కొనుగోలుకు వచ్చిన రైతులతో షాపుల వద్ద కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. ఏఏ పంటలు సాగు చేస్తున్నారు.. షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువగా అమ్ముతున్నారా? వంటి విషయాలపై ఆరా తీశారు. వ్యవసాయశాఖ అధికారులు షెడ్యూల్ ప్రకారం ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు రైతువేదికల్లో నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.విజయనిర్మల, ఏడీఏ శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ మండల ఏవో కిషోర్‌బాబు ఉన్నారు.