భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం నాలుగు గంటలు కాకముందే పూర్తయింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 2,022 మంది ఓటర్లుండగా వారిలో 1,859 మంది టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 163 మంది ఓటు వేయడానికి రాలేదు. జిల్లాలో 23 మండలాల్లోని ఆయా పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రే ఏడు రూట్ల ద్వారా ఆయా పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రిని తరలించారు. ప్రతీ బస్సుతోనూ పోలీస్ ఎస్కార్ట్‌ను పంపారు.
భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో అత్యధికంగా పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం మండలాల్లో ఎక్కువమంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 10 గంటలకు 174 మంది ఓటు వేయగా, 12 గంటలకు 939 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు 1,484 మంది, సాయంత్రం 4 గంటలకు 1,859 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు వేర్వేరుగా పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం రామచంద్రా డిగ్రీ కాలేజీలో జరిగిన పోలింగ్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సింగరేణి స్కూల్లో జరిగిన పోలింగ్ తీరును ఎస్పీ రోహిత్‌రాజు పరిశీలించారు. అన్ని రూట్లలోనూ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటింగ్ ముగిసిన అనంతరం పోలింగ్ బాక్సులకు ఎన్నికల అధికారులు సీల్ వేశారు. పీవో, ఏపీవోలు, రూట్ ఆఫీసర్లు, సెక్టార్ ఆఫీసర్ల ద్వారా బందోబస్తు మధ్య బస్సుల్లో ఈ పోలింగ్ బాక్సులను తీసుకెళ్లారు.
కొత్తగూడెం గణేశ్ టెంపుల్, ఫిబ్రవరి 27 : వరంగల్-ఖమ్మంనల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ భద్రాద్రి జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. మొత్తం 91.94 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. పోలింగ్ ముగిసిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య బ్యాలెట్ బాక్సులను నల్లగొండలోని రిసెప్షన్ సెంటర్‌కు తరలించినట్లు చెప్పారు.