కొత్తగూడెం ఎడ్యుకేషన్, నవంబర్ 7: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల అంశంపై జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఐడీవోసీలో గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలోఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం మాత్రమే కాకుండా వారి సంక్షేమం కోసం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అయితే, ఎస్సీ, ఎస్టీలు ఆయా పథకాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించేలా కృషి చేయాలని కోరారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎస్పీ రోహిత్‌రాజు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ జిల్లా కమిటీ సభ్యులు హాజరైన ఈ సమీక్షలో ఆర్డీవో మధు, ఏపీవో జనరల్ డేవీడ్ రాజు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనసూయ, జిల్లా వైద్యాధికారి భాస్కర్‌నాయక్, సీపీవో సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.