భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాలను తెస్తున్నదని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల అగ్రికల్చర్ ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ఎకరం, రెండు, మూడు ఎకరాలతోపాటు సెంటు భూమి ఉన్న రైతులు సైతం రూ.లక్ష వరకు ఆదాయం పొందడం ఎలా అనే అంశంపై ఎగ్జిబిషన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
అగ్రికల్చర్, హార్టికల్చర్, డీఆర్డీఏ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లు ఎంతో ఆకర్షణగా నిలిచాయని అన్నారు. హైదరాబాద్, ఢిల్లీ లాంటి మహా నగరాల్లో ఇంతకుముందు స్టాళ్లను ఏర్పాటు చేసేవారని, జిల్లా రైతుల కోసం కొత్తగూడెంలో తొలిసారి అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కలెక్టర్ ప్రత్యేక చొరవతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసం జిల్లా రైతులకు కావాల్సిన అన్ని వనరులను చేకూరుస్తున్నారని అన్నారు. ఎస్పీ రోహిత్‌రాజు, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.